పొలంలో మంటలు అంటుకుని వృద్ధురాలు దుర్మరణం..

వ్యవసాయ పొలంలో వ్యర్థాలను తగులబెట్టే క్రమంలో జరిగిన ప్రమాదంలో ఒక వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలోచోటుచేసుకుంది.​స్థానిక గ్రామస్తులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపురం గ్రామానికి చెందిన పావులూరి పిచ్చమ్మ (70) అనే మహిళకు గ్రామంలో వ్యవసాయ పొలం ఉంది. బుధవారం మధ్యాహ్నం సుమారు 3:00 గంటల సమయంలో ఆమె తన పొలానికి వెళ్లింది. మొక్కజొన్న పంట కోత పూర్తయిన తర్వాత పొలంలో మిగిలిపోయిన ఎండిన మొక్కలను (చెత్తను) తొలగించేందుకు ఆమె వాటికి నిప్పు పెట్టింది.​ఎండ తీవ్రతకు తోడు గాలి వీస్తుండటంతో మంటలు ఒక్కసారిగా పక్కనే ఉన్న పొలానికి వ్యాపించాయి. మంటలు విస్తరించడాన్ని గమనించిన పిచ్చమ్మ, వాటిని అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది.ఈ క్రమంలో ఆమె చీరకూ నిప్పు అంటుకుంది. మంటలు క్షణాల్లో శరీరం అంతా వ్యాపించడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది.

​సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకేసారి మంటలు చెలరేగడం,అదుపు చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Share.
Leave A Reply