నియోజకవర్గంలో టీడీపీ విజయం శాశ్వతం కావాలి : ప్రత్తిపాటి పుల్లారావు

📍 చిలకలూరిపేట

తెలుగుదేశం పార్టీ విజయానికి కార్యకర్తల కృషే మూలమని, నియోజకవర్గంలో టీడీపీ జెండా తప్ప మరో జెండా ఎగరని స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త సోషల్ మీడియాలో చురుకుగా ఉండి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

స్థానిక ప్రత్తిపాటి గార్డెన్స్‌లో బుధవారం నిర్వహించిన బీఎల్ఓల అవగాహన సమావేశంలో రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన భాష్యం రామకృష్ణను టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు.

రాజధాని అభివృద్ధిలో కేంద్రం కీలకం

అమరావతికి చట్టబద్ధత కల్పించడం, నిర్మాణానికి నిధులు అందించడం, కేంద్ర సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా రాజధాని అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని ప్రత్తిపాటి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలి

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు ప్రత్తిపాటి సూచించారు. 2014-19 కాలంలో, అలాగే ప్రస్తుతం జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని కోరారు. కొండవీడు అభివృద్ధి, ముస్లిం బాలికల ప్రత్యేక పాఠశాల, కేంద్రీయ విద్యాలయం, బైపాస్ రహదారి, ఆటోనగర్, రోడ్లు, డ్రైన్ల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు.

పార్టీని అప్రతిష్ఠపాలు చేసే వారిపై హెచ్చరిక

స్వప్రయోజనాల కోసం అప్పులు చేసి, వాటి నుంచి బయటపడేందుకు పార్టీని, నాయకత్వాన్ని విమర్శిస్తున్న కొందరు వ్యక్తులపై ప్రత్తిపాటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారు తమ విధానాన్ని మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

టీడీపీ విజయానికి అదృశ్య శక్తి భాష్యం రామకృష్ణ

2019, 2024 ఎన్నికల్లో పార్టీ విజయానికి భాష్యం రామకృష్ణ కీలకంగా కృషి చేశారని ప్రత్తిపాటి కొనియాడారు. కష్టపడి ఎదిగిన విద్యావేత్తగా ఆయన సేవలు పార్టీకి ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు.

చంద్రబాబే నాకు ఆదర్శం : భాష్యం రామకృష్ణ

పనితీరు, కష్టపడే తత్వంలో తనకు నారా చంద్రబాబు నాయుడు ఆదర్శమని భాష్యం రామకృష్ణ పేర్కొన్నారు. ప్రతిరోజూ ఆయన నుంచి కొత్త విషయాలు నేర్చుకోవచ్చన్నారు. లోకేష్ నాయకత్వాన్ని తాను ఎంతో ఇష్టపడతానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ప్రజలకు, రాష్ట్రానికి మంచి పరిపాలన అందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త పేర్ని వీరనారాయణ, అబ్జర్వర్ ఆడక స్వాములు, సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share.
Leave A Reply