పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జనతా వారధి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పణ

నరసరావుపేట, జూలై 20: భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా జనతా వారధి కార్యక్రమం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇన్‌చార్జ్ డీఆర్వో (DRO) గారికి ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధిలో SC, ST, BC వర్గాలకు సముచిత భాగస్వామ్యం, పారిశ్రామిక యాజమాన్య అవకాశాలు, ఉపాధి కల్పించే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రతి శుక్రవారం ప్రజల నుంచి సమస్యలు స్వీకరిస్తూ పర్యటనలు నిర్వహిస్తున్న సందర్భంగా, పారిశ్రామిక రంగంలో BC, SC, ST వర్గాలకు తగిన భాగస్వామ్యం లేకపోవడంపై వివిధ సామాజిక సంఘాలు, కుల పెద్దలు వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో ఈ వినతిపత్రాన్ని సమర్పించినట్లు నాయకులు తెలిపారు.

ప్రభుత్వం ఇటీవల 8 ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు 4,196.55 ఎకరాల భూమిని కేటాయిస్తూ రూ.1,720.88 కోట్ల పెట్టుబడులు, 1.72 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు కల్పించే నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. అదే సమయంలో, ప్రభుత్వ భూములతో అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక పార్కుల్లో సామాజిక న్యాయం ప్రతిబింబించేలా SC, ST, BC వర్గాలకు పారిశ్రామిక యాజమాన్యం, ప్లాట్ల కేటాయింపు, ఉపాధి, వెండర్ డెవలప్‌మెంట్, జాయింట్ వెంచర్లు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక అవకాశాలు, నైపుణ్య శిక్షణ, ఆర్థిక ప్రోత్సాహకాలు మరియు సామాజిక ఆడిట్ వంటి అంశాలను విధానబద్ధంగా అమలు చేయాలని కోరారు.

అలాగే ప్రభుత్వ భూములు పొందే ప్రతి ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కులో సామాజిక భాగస్వామ్యానికి సంబంధించిన స్పష్టమైన నిబంధనలు ఒప్పందాల్లో చేర్చాలని, వాటి అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అందులో BC, SC, ST వర్గాల ప్రతినిధులకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

పల్నాడు జిల్లాలో మరిన్ని SEZలు, ఇండస్ట్రియల్ పార్కులు, తయారీ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మరియు భారీ ఉపాధి కల్పించే పరిశ్రమలు ఏర్పాటు చేసి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ చర్యల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వెనుకబడిన వర్గాల ఆర్థిక సాధికారత, సామాజిక న్యాయం మరియు సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు బీజేపీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, ఎస్టీ మోర్చా పల్నాడు జిల్లా అధ్యక్షులు తిలక్ నాయక్, పల్నాడు జిల్లా కార్యదర్శి మరియు జనతా వారధి కో-కన్వీనర్ జాన్ బాబు, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి యేసు రత్నం, జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి పడకండ్ల లక్ష్మాచారి, కుంభ ఏడుకొండలు, గుండా ఉపేంద్ర, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి ఎటుకూరి స్వామి, శామల్యాపురం మండల అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు, అచ్చంపేట మండలం బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply