వైసీపీ ఒక ‘గొడ్డలి పార్టీ’.. ఎమ్మెల్సీల రాజీనామాల తిరస్కరణపై మర్రి రాజశేఖర్ ఆగ్రహం
చిలకలూరిపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీని “గొడ్డలి పార్టీ” గా అభివర్ణించారు. విలువలకు తిలోదకాలిచ్చి, హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శిస్తూ, ఆ పార్టీ అసలు స్వరూపం ఈరోజు తేటతెల్లమైందని మండిపడ్డారు.
రాజీనామాలపై చైర్మన్ తీరుపై విమర్శలు
తాము స్వచ్ఛందంగా వైసీపీకి రాజీనామా చేసి, ఆమోదం కోసం మండలి చైర్మన్‌కు పత్రాలు సమర్పించినప్పటికీ, వాటిని తిరస్కరించడం అప్రజాస్వామికమని ఆయన పేర్కొన్నారు.
ఎమ్మెల్సీల రాజీనామాలను చైర్మన్ తిరస్కరించిన విషయాన్ని అధికారికంగా బయటకు చెప్పకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. చైర్మన్ తీసుకున్న ఈ నిర్ణయం నిబంధనలకు మరియు చట్టానికి విరుద్ధంగా ఉందని, స్వచ్ఛందంగా ఇచ్చిన రాజీనామాలను ఆమోదించకపోవడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు.ఈ పరిణామాలన్నీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కనుసైగల్లోనే జరుగుతున్నాయని, చైర్మన్ స్వతంత్రంగా కాకుండా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిర్ణయాలు తీసుకుంటున్నారని మర్రి రాజశేఖర్ తీవ్రంగా ఖండించారు.
ఎవరి ప్రయోజనాల కోసం, ఏ ప్రాతిపదికన తమ రాజీనామాలను తిరస్కరించారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ నుంచి బయటకు రావాలనే తమ నిర్ణయంలో మార్పు లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.



