- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇంచార్జ్ డిఆర్ఓ గారికి గీత కులాల గౌరవం పర్యావరణ పరిరక్షణ స్వాలంబన కోసం జనతా వారధి తరపున వినతి పత్రము ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి అనుమతితో పల్నాడు జిల్లా జనతా వారధి టీం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గీత గీత కులాలు గౌరవం పర్యావరణ పరిరక్షణ స్వాలంబన కోసం ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు ఇత్తడి కిరణ్ గారు పల్నాడు జిల్లా మీడియా ఇన్ఛార్జి కోమటి వాసు నరసరావుపేట టూ టౌన్ ప్రధాన కార్యదర్శి ముప్పవరపు సంపత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
- ఎడ్లపాడు మండలం ఎడ్లపాడు లో బిజెపి నాయకులు బందెల శ్రీనివాసరావు గారు తాను నివసిస్తున్న హరిజనవాడకు కరెంటు కోసం ఫిర్యాదు తీసుకురాగా పల్నాడు జిల్లా కరెంట్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది . తదుపరి వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు సమర్పించడం జరిగింది
జనతా వారధి
ది. 08.06.2026 సోమవారం
విషయం : గీత కులాల గౌరవం – పర్యావరణ పరిరక్షణ – స్వావలంబన కోసం వినతి
తరతరాలుగా ప్రకృతితో మమేకమై జీవిస్తూ, తాటి చెట్టును ఆధారంగా చేసుకొని కుటుంబాలను పోషించుకుంటున్న గౌడ, శెట్టిబలిజ, శ్రీశైన, ఈడిగ, యాత తదితర గీత కులాల ఆకాంక్షలను మీ ముందుకు వినమ్రంగా తీసుకువస్తున్నాము.
భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న “జనతా వారధి” కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గీత కులాల స్థితిగతులను అధ్యయనం చేయడం జరిగింది. అలాగే గీత కులాల సంఘాలు, సొసైటీలు, పెద్దలు, మేధావులు మరియు వృత్తిదారులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వచ్చిన సూచనలు, అభిప్రాయాలు మరియు ఆకాంక్షల ఆధారంగా ఈ వినతిని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తున్నాము.
భారతదేశ సనాతన జీవన విధానంలో తాటి చెట్టు ఒక సాధారణ వృక్షం కాదు. అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక, పర్యావరణ పరిరక్షణకు సహజ రక్షకుడు, వేలాది కుటుంబాల జీవనాధారం. తాటి చెట్టు మన సంస్కృతికి, మన గ్రామీణ జీవన విధానానికి ప్రతీక.
అయితే నేడు గీత వృత్తి అనేక సవాళ్లను ఎదుర్కొంటూ తన ఉనికిని కాపాడుకునే పరిస్థితికి చేరుకుంది. తాటి చెట్ల సంఖ్య క్రమంగా తగ్గిపోవడం, వృత్తికి తగిన ప్రోత్సాహం లేకపోవడం, యువత ఈ వృత్తికి దూరమవడం, ఎక్సైజ్ చట్టాల కారణంగా ఏర్పడుతున్న ఇబ్బందులు, గీత వృత్తిదారుల పట్ల సమాజంలో ఉన్న అపోహలు వారి కుటుంబాల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.
ముఖ్యంగా మద్యం దుకాణాల రిజర్వేషన్ విధానంలో అసలు లబ్ధిదారులకు ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందకపోవడం, రాజకీయంగా బలమైన వర్గాలు అవకాశాలను వినియోగించుకోవడం వల్ల గీత వృత్తిదారులు నష్టపోతున్నారు. గీత వర్గాల పేరుతో కల్పించిన అవకాశాలు కూడా చాలాసార్లు వారికి అందని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
గీత కులాల సంఘాలు, సొసైటీలు, పెద్దలు, మేధావులు సమాజంపై బాధ్యతతో అనేక విలువైన సూచనలు చేశారు. వాటిని పరిగణనలోకి తీసుకుని క్రింది అంశాలపై తక్షణ చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నాము.
మా ప్రధాన విజ్ఞప్తులు
- తాడి చెట్లకు సంబంధించిన ఎక్సైజ్ చట్టాలను పునఃసమీక్షించి, తాటి చెట్టు సంరక్షణ మరియు గీత వృత్తిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంస్కరణలు చేపట్టాలి.
- గీత వృత్తిని గౌరవప్రదమైన సంప్రదాయ వృత్తిగా గుర్తించి ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి.
- నీరా పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి, నీరా ఆధారిత ఉత్పత్తులకు మార్కెట్, బ్రాండింగ్ మరియు ప్రోత్సాహం కల్పించాలి.
- రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో తాటి మొక్కల పెంపక కార్యక్రమాన్ని ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టాలి.
- ఆంధ్రప్రదేశ్ సముద్రతీర ప్రాంతాలలో “పామ్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్” అమలు చేసి పర్యావరణ పరిరక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలి. సముద్రతీర ప్రాంత పరిశ్రమలు, కర్మాగారాలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి.
- తాటి ఆధారిత బయోడీజిల్, హార్టికల్చర్, ఆయుష్, ఫుడ్ ప్రాసెసింగ్, హస్తకళలు మరియు ఇతర విలువ ఆధారిత ఉత్పత్తులపై పరిశోధన, పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాలి.
- నీరా కాంపౌండ్లు, సంప్రదాయ కల్లు విక్రయ కేంద్రాలను ఆధునికీకరించి పరిశుభ్రమైన, గౌరవప్రదమైన మరియు వృత్తిపరమైన నిర్వహణకు అవకాశాలు కల్పించాలి.
- గీత వృత్తిదారుల పిల్లలకు విద్య, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలలో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలి.
- గీత వృత్తి కేవలం ఉపాధి మార్గం మాత్రమే కాదు; అది మన సంస్కృతి, మన ఆత్మగౌరవం, మన అస్తిత్వమనే విషయాన్ని సమాజానికి తెలియజేసే కార్యక్రమాలు చేపట్టాలి.
- గీత కులాల ఆదిపురుషుడిగా భావించే కౌండిన్య మహర్షి జయంతిని అధికారికంగా నిర్వహించి రాష్ట్రస్థాయి గుర్తింపు ఇవ్వాలి.
తాటి చెట్టును కాపాడటం అంటే ప్రకృతిని కాపాడటం. గీత కులాలను ఆదుకోవడం అంటే గ్రామీణ భారత ఆత్మను బలోపేతం చేయడం. తాటి చెట్టు నీడలో పెరిగిన తరాలు, భవిష్యత్ తరాలకు కూడా అదే గౌరవం, అదే జీవనాధారం అందాలని మేము కోరుకుంటున్నాము.
ఈ సంకల్పంతోనే భారతీయ జనతా పార్టీ “సంకల్పం” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా తక్కువ సమయంలో పెరిగే తాటి మరియు పామ్ జాతి మొక్కల నాటే కార్యక్రమాన్ని ప్రారంభించింది దీనికి అధికారులు సహకరించాలి.
ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గీత వృత్తిదారుల కుటుంబాలను సందర్శించి వారి జీవన పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. గీత కులాల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందనే ఆశాభావం సమాజంలో ఉంది. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టాలని వినమ్రంగా కోరుతున్నాము.
గీత కులాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ స్వావలంబన మరియు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు దోహదపడే నిర్ణయాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము.
పల్నాడు జిల్లా జనతా వారధి టీమ్



