ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రజల దినచర్యగా మారాలి : ప్రత్తిపాటి

  • క్లీన్ స్వీప్ లో భాగంగా చీపురు పట్టి రోడ్డు శుభ్రం చేసిన ప్రత్తిపాటి.
  • తాటిముంజలమ్మే చిన్నారులతో మాట్లాడి, ముంజలు కొని రుచిచూసిన ఎమ్మెల్యే.

ప్రజల భాగస్వామ్యం, వారి బాధ్యతాయుత పనితీరుతోనే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం అవుతాయని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన చిలకలూరిపేటలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో పాల్గొన్నారు. స్వయంగా చీపురు పట్టిన ప్రత్తిపాటి.. స్థానిక నాయకులతో కలిసి రోడ్డు శుభ్రం చేశారు. అనంతరం ఒక కూడలిలో తాటిముంజలు అమ్ముతున్న చిన్నారులతో మాట్లాడి, ఎక్కడి నుంచి వచ్చారు. తాటికాయలు ఎక్కడ తెచ్చారు.. అన్నీ అమ్మితే ఎంత లాభం వస్తుందని వారిని ప్రశ్నించగా, పిల్లలు ఉత్సాహంగా ప్రత్తిపాటికి సమాధానమిచ్చారు. అనంతరం వారి వద్ద ముంజలు కొనుగోలు చేసి రుచిచూసిన ప్రత్తిపాటి బాగున్నాయని వారిని మెచ్చుకున్నారు.

ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజలు తమ సొంతపనులుగా భావించాలి
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అయినా.. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర అయినా ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతం అవుతాయన్నారు. ప్రభుత్వం వీధులు, పట్టణాలు, గ్రామాల శుభ్రతను ఒక ప్రాజెక్టులా నిర్వహిస్తోందని, అలాంటప్పుడు ప్రజలు ఇష్టానసారం వ్యవహరిస్తే ఉపయోగం ఏముంటుందని ప్రత్తిపాటి ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం ఒక మంచి ఆశయంతో చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలంటే, దానిని ప్రజలు తమ సొంత పనిగా భావించాలన్నారు.
ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రజల దినచర్యలో భాగం కావాలన్న ప్రత్తిపాటి.. పరిశుభ్రమైన గ్రామాలు, పట్టణాలే సుస్థిర అభివృద్ధికి అసలైన ప్రామాణికాలుగా నిలుస్తాయన్నారు. హరితాంధ్ర, స్వచ్చాంధ్ర అనేవి కేవలం నినాదాలు కావని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే గొప్ప కార్యక్రమాలని ప్రత్తిపాటి తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన వ్యర్థాల నిర్వహణ, రీ సైక్లింగ్, హరితాంధ్ర కార్యక్రమాలతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు మస్తాన్ వలి, బేరింగ్ మౌలాలి, తుపాకుల అప్పారావు , మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply