చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా..
మాజీ కమిషనర్‌తో సహా తొమ్మిది మందిపై వేటు!
చిలకలూరిపేట మున్సిపాలిటీలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన సొమ్మును కాజేసిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. నకిలీ రసీదులు సృష్టించి ఏకంగా రూ.34 లక్షల ప్రభుత్వ నిధులను స్వాహా చేసిన ఘటనపై కఠిన చర్యలకు ఆదేశిస్తూ శుక్రవారం జీవో జారీ చేసింది.
నకిలీ రసీదులతో నయా దందా: పురపాలక సంఘం పరిధిలో ఆస్తి పన్ను, కుళాయి పన్ను తదితర పన్నులు చెల్లించడానికి వచ్చిన అమాయక ప్రజలకు మున్సిపల్ సిబ్బంది నకిలీ రసీదులు చేతిలో పెట్టారు. వసూలైన నగదును ఖజానాకు జమ చేయకుండా రూ.34 లక్షల వరకు పక్కదారి పట్టించారు.
మాజీ కమిషనర్‌పై యాక్షన్: ఈ భారీ స్కామ్‌కు బాధ్యులను చేస్తూ అప్పటి మున్సిపల్ కమిషనర్ రవీంద్రతో పాటు ఈ అవినీతిలో భాగస్వాములైన తొమ్మిది మంది సిబ్బందిపై శాఖాపరమైన చర్యలకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
విజిలెన్స్ ఎంట్రీ.. సస్పెన్షన్ల పర్వం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అవినీతి వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అధికారుల అక్రమాలు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో, కూటమి ప్రభుత్వం ఇప్పటికే సదరు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
ప్రధాన నిందితురాలు గంగాభవాని: ఈ స్కామ్‌లో మాజీ మంత్రికి సమీప బంధువు అయిన ‘గంగాభవాని’ ప్రధాన సూత్రధారిగా అధికారులు గుర్తించారు. మున్సిపాలిటీలో కేవలం ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా చేరిన ఆమె.. ఏకంగా పన్నుల వసూళ్లలో కీలక పాత్ర పోషించి నిధులు స్వాహా చేసినట్లు తేలింది. ఈమెపై గతంలోనే పోలీస్ కేసు కూడా నమోదు కావడం గమనార్హం.
భయంతో రూ.12 లక్షలు వెనక్కి: మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో ఈ అవినీతి వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ (TDP) కౌన్సిలర్లు పదేపదే నిలదీయడంతో సదరు ఉద్యోగిని దిగివచ్చారు. విచారణలో దొరికిపోతామన్న భయంతో.. స్వాహా చేసిన నిధుల్లోంచి సుమారు రూ.12 లక్షల వరకు తిరిగి మున్సిపల్ ఖాతాలో జమ చేయడం ఈ స్కామ్‌కు అద్దం పడుతోంది.
అధికారం అండ ఉంటే ఏమైనా చేయొచ్చు అన్నట్లుగా సాగిన ఈ దందా.. విజిలెన్స్ ఎంట్రీతో పేకమేడలా కూలిపోయింది. ప్రజల సొమ్మును దోచుకున్న వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రభుత్వం ఈ చర్యల ద్వారా స్పష్టం చేసింది. అయితే, వెనక్కి ఇచ్చిన రూ.12 లక్షలు పోనూ.. మిగిలిన రూ.22 లక్షల రికవరీ ఎప్పుడు జరుగుతుంది? ఈ కుంభకోణంలో తెరవెనుక ఇంకెవరి పాత్ర ఉందన్నది ఇప్పుడు చిలకలూరిపేట పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది.



