పల్నాడు జిల్లా జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ బీసీ బాలికల సంక్షేమ హాస్టల్స్ గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది

ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నభట్ల ఆదిత్య దాచేపల్లి మండల అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు నరసరావుపేట పట్టణ కార్యదర్శి సంపత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్ కార్యాలయం లొ వినతి పత్రం సమర్పించడం జరిగింది

విషయం : SC, ST, BC బాల బాలికల సంక్షేమ వసతి గృహాలలో సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని వినతి.
(ఈ వేసవి కాలం వసతి గృహాల సంస్కరణ కాలంగా పరిగనించండి)

భారతీయ జనతా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “జనతా వారధి” కార్యక్రమం ద్వారా ప్రతి వారం గ్రామాలు, పట్టణాలు సందర్శిస్తూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, వాటి తక్షణ పరిష్కారానికి కృషి చేస్తున్నది. మరియు ప్రజల ఆశలు, ఆవేదనలు, అవసరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కార్యకర్తలు బాధ్యతగా భావిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల రాష్ట్రంలోని SC, ST, BC బాల బాలికల సంక్షేమ వసతి గృహాలను సందర్శించడం జరిగింది. మెట్రిక్ మరియు పోస్ట్-మెట్రిక్ హాస్టల్స్ పరిశీలనలో భాగంగా విద్యార్థులతో, వార్డెన్‌లతో, సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు, అనుభవాలు తెలుసుకోవడం జరిగింది. ముందుగా, ఇటీవల ప్రభుత్వం తీసుకున్న కొన్ని సానుకూల చర్యలను అభినందిస్తున్నాము. డైట్ బిల్లుల చెల్లింపులో వేగం పెరగడం, కాస్మోటిక్ అలవెన్సుల విడుదల, ఆహార నాణ్యతలో మెరుగుదల వంటి మార్పులు విద్యార్థుల్లో కొంత భరోసా కలిగించాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి మా ధన్యవాదాలు.

అయితే, క్రింది స్థాయిలో ఇంకా అనేక సమస్యలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం ఐదేండ్లు సంక్షేమ హాస్టల్స్ ను విస్మరించింది. వారి నిర్లక్ష్యం ఇంకా వెంటాడుతుంది. కొన్ని హాస్టల్స్‌లో విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులు మనసును కలచివేస్తున్నాయి —
చాలా చోట్ల భవనాలు పాడై ప్రమాదకరంగా ఉండడం, తగిన శుభ్రత లేకపోవడం, తాగునీటి కొరత, సరైన పోషకాహారం అందకపోవడం, వైద్య సదుపాయాల లోపం, విద్యా సహాయం లేకపోవడం వంటి సమస్యలు స్పష్టంగా గమనించాము. కొన్ని సందర్భాల్లో పిల్లలు తమ సమస్యలను చెప్పడానికి కూడా భయపడుతున్న పరిస్థితి కనిపించింది — ఇది అత్యంత ఆందోళనకరం.

ఈ నేపథ్యంలో, ప్రస్తుత వేసవి సెలవులను ఒక అవకాశంగా తీసుకుని సంక్షేమ హాస్టల్స్‌లో సమగ్ర మార్పులు తీసుకురావాలని మేము గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాము.

మా ముఖ్యమైన సూచనలు మరియు చర్చించి నిర్ణయం తీసుకోవలసిన విషయాలు క్రింద విధంగా ఉన్నాయి:

  1. విద్యార్థులు సెలవులకు వెళ్లే ముందు ప్రతి హాస్టల్‌లో తల్లిదండ్రులు/గార్డియన్‌ల సమావేశాలు నిర్వహించాలి. ఈ సమావేశాల్లో మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలు తదితర ప్రజా ప్రతినిధులు పాల్గొనాలి.
  2. విద్యార్థుల సమస్యలు, అనుభవాలు నమోదు చేసి వాటిపై చర్యలు తీసుకునే వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
  3. విద్యార్థి–తల్లిదండ్రులు–ప్రభుత్వం మధ్య నమ్మకాన్ని బలోపేతం చేయాలి.
  4. రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్టల్స్‌కు Infrastructure Audit నిర్వహించి ప్రమాదకర భవనాలను వెంటనే పునర్నిర్మించాలి లేదా మార్చాలి. గదులు, మరుగుదొడ్లు సున్నాలు పెయింట్ లు వేసి శుభ్రపరచాలి.
  5. ప్రతి విద్యార్థికి కనీస వసతి ప్రమాణాలు నిర్ధారించాలి.
  6. ప్రస్తుత ధరల ఆధారంగా డైట్ చార్జీలను పెంచి, మెను అమలు కచ్చితంగా జరిగేలా చూడాలి.
  7. ప్రతి హాస్టల్‌లో RO ప్లాంట్ ఏర్పాటు చేయాలి.
  8. శుభ్రత కోసం ప్రత్యేక మానిటరింగ్ టీమ్‌లను ఏర్పాటు చేయాలి.
  9. విద్యా ప్రమాణాల పెంపు కోసం ట్యూటర్స్ నియామకం మరియు డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు కల్పించాలి.
  10. అన్ని హాస్టల్స్‌లో CCTV ఏర్పాటు చేయాలి; బాలికల హాస్టల్స్‌లో మహిళా వార్డెన్లు తప్పనిసరి చేయాలి.
  11. బిల్లుల చెల్లింపును పారదర్శకంగా Direct Benefit Transfer (DBT) ద్వారా చేయాలి.
  12. ఫిర్యాదుల పరిష్కారం కోసం టోల్-ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి.
  13. ప్రతి నెల వైద్య పరీక్షలు మరియు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలి.
  14. ప్రతి నెల విద్యార్థులతో ఓపెన్ మీటింగ్ నిర్వహించి వారి సమస్యలను నేరుగా నమోదు చేసే విధానం తీసుకురావాలి.

సంక్షేమ హాస్టల్స్ అనేవి కేవలం వసతి గృహాలు కావు — అవి అణగారిన వర్గాల పిల్లలకు భవిష్యత్తు నిర్మించే కేంద్రాలు. ఒక పేద విద్యార్థి తన గ్రామానికి వెళ్లేటప్పుడు “నా హాస్టల్‌లో సమస్యలు ఉన్నాయి” అని చెప్పకుండా, తిరిగి వచ్చేటప్పుడు “ఇది నా ఇంటికంటే మంచి స్థలం” అని గర్వంగా చెప్పే పరిస్థితి రావాలి. అదే నిజమైన సంక్షేమం. అదే నిజమైన పరిపాలన.

ఈ వేసవి సెలవులను “సంస్కరణల కాలం”గా మార్చి, ప్రతి విద్యార్థి హృదయంలో “ప్రభుత్వం మా వెంట ఉంది” అనే నమ్మకాన్ని కలిగించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాము.

సేవా అంత్యోదయ పరమావధిగా సమాజంలో అణగారిన వర్గాల అభివృద్ధి, సమానత్వం కోసం భారతీయ జనతా పార్టీ పని చేస్తుంది. మేము ఒక ఉద్యమ స్ఫూర్తితో వారికీ అండగా నిలుస్తాము. వారి సమస్యల పరిష్కారం కోసం పని చేస్తాము. మీరు పై విషయాలు అత్యంత కీలకమైనవిగా పరిగనించాలని వినతిస్తున్నాము.

ఇట్లు
పల్నాడు జిల్లా జనతా వారధి రాష్ట్ర జట్టు

Share.
Leave A Reply