తక్కువ వడ్డీకి రుణాలు. అధిక వడ్డీ ఆశచూపి మోసగించిన వ్యక్తిపై ప్రత్తిపాటికి ఫిర్యాదు చేసిన పలు గ్రామాల ప్రజలు
- బాధితుల ఫిర్యాదుపై సమగ్ర దర్యాప్తు జరిపి, వారికి న్యాయం చేయాలని పోలీసులకు సూచించిన ప్రత్తిపాటి
- త్వరలోనే అర్హులకు ప్రభుత్వం నుంచి కొత్త పింఛన్లు,
- ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి, అర్జీలు స్వీకరించిన ప్రత్తిపాటి
అధిక వడ్డీల ఆశ చూపడంతో పాటు.. తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తానని తెలివిగా నమ్మించి తమ కష్టార్జితాన్ని దోచుకున్న వ్యక్తిపై పలు గ్రామాల ప్రజలు శనివారం మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటికి ఫిర్యాదు చేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన సమయంలో ఎమ్మెల్యేను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. చిలకలూరిపేట మండలం గొట్టిపాడుకు చెందిన నాగళ్ల వెంకట్రావు అనే వ్యక్తి.. రూ.10 వేలు మొదలు ఆ పైన మీస్థాయికి తగినంత ఇస్తే, ఆ మొత్తాన్ని తెలిసిన సంస్థల్లో పెట్టుబడులు రూపంలోకి మార్చి, ఎక్కువ లాభాలు అందిస్తానని నమ్మబలికి, అందినకాడికి దండుకొని ఇప్పుడు ముఖం చాటేశాడని ప్రజలు ఎమ్మెల్యే ప్రత్తిపాటికి మొరపెట్టుకున్నారు. తమకు జరిగిన మోసాన్ని ఇప్పటికే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి తెలియచేశామని, వారు విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారని, తమకు జరిగిన మోసాన్ని గుర్తించి, సమస్యపై ఉన్నతాధికారులతో మాట్లాడి తమకు న్యాయం జరిగేలా చూడాలని చిలకలూరిపేట మండలం గొట్టిపాడు, మిట్టపాలెం, దండమూడి, ఈవూరివారిపాలెం, అవిశాయపాలెం గ్రామస్తులు స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు ఫిర్యాదుచేశారు.
గ్రామస్తుల విజ్ఞప్తిపై స్పందించిన ప్రత్తిపాటి పోలీస్ అధికారులతో మాట్లాడి, మోసపోయిన వారికి న్యాయం చేయాలని, పేద, మద్యతరగతి ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని ఆదేశించారు. బాధితులు ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందున, అధైర్య పడాల్సిన పనిలేదని ప్రత్తిపాటి తెలిపారు. జిల్లా ఎస్పీ నేతృత్వంలో చిలకలూరిపేట పోలీస్ వారు పిర్యాదుపై సమగ్ర దర్యాప్తు జరిపి, మీకు తగిన న్యాయం చేస్తారని ప్రత్తిపాటి బాధితులకు భరోసా ఇచ్చారు.
త్వరలోనే అర్హులకు కొత్త పింఛన్లు
సామాజిక పింఛన్లు పొందే అర్హులకు ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెబుతుందని, అర్హులైన వారికి తప్పకుండా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుతాయని ప్రత్తిపాటి చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా పింఛన్లు కావాలని పలు అర్జీలు తన దృష్టికి రావడంపై స్పందించారు. ఇప్పటికే ప్రభుత్వం అర్హులైన వితంతువులకు కొత్త పింఛన్లు అందిస్తోందని, అలానే వికలాంగులకు న్యాయం చేసిందన్నారు. వృద్ధులకు కూడా త్వరలోనే న్యాయం చేస్తుందని ప్రత్తిపాటి హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, టీడీపీ నాయకులు ముద్దన నాగేశ్వరరావు, మద్దిబోయిన శివ, బేరింగ్ మౌలాలి, పట్టణ సి.ఐ రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



