- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి చెరువుల మట్టి నిర్వహణ పై జనతా వారధి తరపున వినతి పత్రము ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి అనుమతితో పల్నాడు జిల్లా జనతా వారధి టీం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చెరువుల మట్టి నిర్వహణపై వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ మోర్చా ఇన్చార్జి మరియు జనతా వారిది స్టేట్ టీమ్ నెంబర్ కేతనబోయిన హనుమంతరావు మరియు పల్నాడు జిల్లా మీడియా ఇన్ఛార్జి కోమటి వాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
విషయం : రాష్ట్రవ్యాప్తంగా చెరువు మట్టి తవ్వకాలపై నిబంధనలు కచ్చితంగా అమలు చేయుట, గత పాలనలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టుట, రైతులకు మరియు కుమ్మరి వృత్తిదారులకు చెరువు మట్టిని ఉచితంగా అందించుట – వినతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 1.13 లక్షల చెరువులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా నిలుస్తున్నాయి. చెరువులు సాగునీటి వనరులు మాత్రమే కాకుండా భూగర్భ జలాల పునరుద్ధరణ, చేపల పెంపకం, వర్షపు నీటి నిల్వ, గ్రామ పర్యావరణ సమతౌల్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
చెరువుల్లో సంవత్సరాలుగా పేరుకుపోయే పూడికను తొలగించడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. సాగునీటి అందుబాటు మెరుగుపడుతుంది. భూగర్భ జలాలు పునరుద్ధరించబడతాయి. రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతుంది.
అయితే, భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమంతో గ్రామాల్లోకి పర్యటనలు చేస్తూ ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తుంది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తుంది. అందులో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న చెరువు మట్టి తవ్వకాలలో అనేక ప్రాంతాల నుండి మస్టర్ రోల్స్, పని అంచనాలు, కొలత పుస్తకాలు (MB), వినియోగ ధృవీకరణ పత్రాలు, సోషల్ ఆడిట్ రికార్డులు లేకుండానే పనులు జరుగుతున్నాయనే ఫిర్యాదులు అందుతున్నాయి.
అదేవిధంగా, 2019–2024 మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున చెరువు మట్టి అక్రమ తవ్వకాలు జరిగి, ఆ మట్టిని బహిరంగ మార్కెట్లో విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుబాటులో ఉన్న అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 20 నుండి 65 కోట్ల క్యూబిక్ మీటర్ల వరకు పూడిక మట్టి తరలించబడినట్లు భావించబడుచున్నది. దీని మార్కెట్ విలువ సుమారు ₹13,500 కోట్ల నుండి ₹31,500 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా.
గతంలో ఈ అక్రమాలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అనేక ప్రజా సంఘాలు, రైతు సంఘాలు మరియు భారతీయ జనతా పార్టీ పలు సందర్భాలలో నిరసనలు చేపట్టినప్పటికీ తగిన విచారణ జరగలేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం చెరువు మట్టిని విక్రయించరాదు. చెరువు మట్టిని రైతుల పొలాలకు, నేల సారం పెంచుటకు, చెరువు గట్లు బలపరచుటకు, గ్రామ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వ అవసరాల కొరకు, కుమ్మరి వృత్తిదారుల వినియోగానికి ఉపయోగించవలసి ఉంటుంది.
చెరువు మట్టి తరలింపునకు సాధారణంగా క్రింది పత్రాలు తప్పనిసరిగా ఉండవలెను
- గ్రామ పంచాయతీ తీర్మానం
- జలవనరుల శాఖ అనుమతి
- తహసీల్దార్ సమాచారం
- కొలతల నమోదు పుస్తకం (MB)
- వినియోగదారుల రిజిస్టర్
- సోషల్ ఆడిట్ రికార్డులు
- అవసరమైతే మైనింగ్ క్లియరెన్స్ / NOC
అయితే, ప్రస్తుత అమలులో ఈ నిబంధనలు అనేక ప్రాంతాల్లో పాటించబడటం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి.
అందువల్ల మా వినతులు :
- రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న చెరువు మట్టి తవ్వకాలపై ప్రత్యేక పర్యవేక్షణ కమిటీ నియమించాలి.
- 2019–2024 మధ్య జరిగిన చెరువు మట్టి తవ్వకాలపై న్యాయ / విజిలెన్స్ విచారణ చేపట్టాలి.
- ప్రతి చెరువు మట్టి తవ్వకానికి పూర్తి పారదర్శకతతో రికార్డులు నిర్వహించాలి.
- చెరువు మట్టిని రైతులకు పూర్తిగా ఉచితంగా అందించాలి.
- కుమ్మరి వృత్తిదారులకు వారి జీవనోపాధి కోసం అవసరమైన మట్టిని ఉచితంగా కేటాయించాలి.
- అక్రమ చెరువు మట్టి అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- ప్రతి క్యూబిక్ మీటర్ మట్టి వినియోగానికి డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
- సోషల్ ఆడిట్‌ను తప్పనిసరి చేయాలి.
“చెరువు మట్టి రైతుల హక్కు – కొందరి వ్యాపార వస్తువు కాదు.”
చెరువులను పరిరక్షిస్తే రైతు బలపడతాడు. రైతు బలపడితే గ్రామం అభివృద్ధి చెందుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకొని రైతుల, కుమ్మరి వృత్తిదారుల హక్కులను కాపాడవలసిందిగా వినయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ కోరుచున్నది.



