జనగణన 2027 పై శిక్షణ తరగతులు ప్రారంభం
2011 తరువాత దేశవ్యాప్తంగా జరుగుతున్న 2027 జనగణన ప్రక్రియపై మూడు రోజుల శిక్షణ తరగతులు గణపవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేడు ప్రారంభమయ్యాయి. మండలంలో జనగణన విధుల్లో 150 మంది ఎన్యుమరేటర్లు, పర్యవేక్షణ అధికారులుగా మరో 14 మంది పాల్గొననున్నారు. మొత్తం ప్రక్రియకు చార్జ్ అధికారిగా తహశీల్దార్ కుటుంబ రావు వ్యవహరించనున్నారు. 150 మంది ఎన్యుమరేటర్లను మూడు బృందాలుగా విభజించి ఒక్కో బృందానికి మూడు రోజుల చొప్పున జనగణన ప్రక్రియపై శిక్షణ ఇవ్వనున్నారు. తొలి రోజు శిక్షణ తరగతులను తహశీల్దార్ వై.వి.బి. కుటుంబ రావు ప్రారంభించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు సుభాని, కాట్రూ శ్రీనివాసరావు శిక్షకులుగా వ్యవహరించనున్నారు. డిప్యూటీ తహశీల్దార్ షేక్ సల్మాన్, సిబ్బంది పాల్గొన్నారు.



