వంట గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్‌పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి: మురికిపూడి ప్రసాద్
కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షుడు
వంట గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ఉన్నతాధికారులు తక్షణమే సమగ్ర సమాలోచనలు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొంతమంది వ్యక్తులు వినియోగదారులను మభ్యపెట్టి అధిక ధరలకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేసి వాటిని కమర్షియల్‌గా విక్రయిస్తూ అక్రమంగా లాభాలు పొందుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
వినియోగదారులకు సరఫరా చేసే ప్రతి గ్యాస్ సిలిండర్‌పై ఉన్న సీరియల్ నంబర్‌ను గుర్తించి, వినియోగదారుడు తన పుస్తకంలో నమోదు చేసుకోవడం ద్వారా బ్లాక్ మార్కెటింగ్‌ను నియంత్రించవచ్చని సూచించారు. ఈ విధానం గతంలో ప్రభుత్వాలు అమలు చేసినదేనని, కొత్తది కాదని స్పష్టం చేశారు.
వినియోగదారులు ఎక్కువ ధర వస్తుందనే ఆశతో తమ సిలిండర్లను విక్రయించడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు. సరఫరా సమృద్ధిగా ఉన్నప్పటికీ, గ్యాస్ కొరత వస్తుందనే భయంతో అవసరం లేని వారు కూడా పెద్ద ఎత్తున బుకింగ్స్ చేయడం వల్ల సర్వర్లు జామ్ అవుతున్నాయని, నిజంగా అవసరమైన వినియోగదారులకు బుకింగ్ చేయడం కష్టసాధ్యమవుతోందని అన్నారు.
గ్యాస్ బుకింగ్ చేసిన రెండు నుంచి మూడు రోజుల్లోనే సిలిండర్‌ను వినియోగదారులకు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా, కొంతమంది వినియోగదారుల పేర్లపై ఓటీపీ లేకుండానే సిలిండర్లు బుక్ అవుతున్నాయనే ఆరోపణలపై కూడా అధికారులు దర్యాప్తు చేయాలని కోరారు.
గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులతో గౌరవప్రదంగా వ్యవహరించాలని, వారి ఫోన్ కాల్స్‌కు స్పందిస్తూ సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలని సూచించారు. గ్యాస్ డెలివరీ విషయంలో ఇబ్బందులు ఎదురైతే డెలివరీ సిబ్బందిపై ఒత్తిడి చేయకుండా, సంబంధిత గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులను లేదా 08647-257999 నంబర్‌కు సంప్రదించి ఫిర్యాదు చేయాలని మురికిపూడి ప్రసాద్ తెలిపారు.



