పేదల సొంతింటి కల సాకారంతో వారి గౌరవం, భద్రతకు ప్రభుత్వం మద్ధతుగా నిలుస్తోంది : ప్రత్తిపాటి
- గృహ నిర్మాణ రంగానికి రూ.6357 కోట్లు కేటాయించడం శుభపరిణామం
- పేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న బాద్యతలో ఇది తొలి విజయం
- గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటిస్థలాలు పేదలకు ఉచితంగా ఇవ్వాలన్న సీఎం నిర్ణయానికి తిరుగులేదు
- 2014-19 మధ్య నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణ పూర్తికి ప్రభుత్వం సహకరించాలి
- టిడ్కో గృహాల్లో అన్నివసతులు కల్పిస్తే, నివాసానికి ప్రజలు సుముఖమే
- విద్య, వైద్యసౌకర్యాలు, ప్రార్థనామందిరాలు, దుకాణ సముదాయాలు, శ్మశానం, కమ్యూనిటీ భవనాలు, కల్యాణమండపాలు నిర్మాణాలు చేపట్టాలి
- గత ప్రభుత్వంలో జరిగిన ఇళ్లస్థలాల అవినీతిపై ప్రభుత్వం తక్షణమే విచారణ చేపట్టాలి
- ప్రత్యేక విచారణ కమిటీ వేసి, అవినీతి పరుల్ని శిక్షిస్తేనే ప్రభుత్వంపై ప్రజల నమ్మకం రెట్టింపు అవుతుంది
- చిలకలూరిపేటలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, మాజీ అవినీతి మంత్రి దోపిడీపై సొంతపార్టీ వారే కోర్టులను ఆశ్రయించారు
- ప్రజా తిరుగుబాటుతో నాటి అవినీతి మంత్రి భూ యజమానుల నుంచి తీసుకున్న సొమ్మును వెనక్కిచ్చేశారు.
- ఇళ్లస్థలాలకు అవసరమైన భూమిని ప్రభుత్వం నుంచి ఎక్కువ ధర ఇప్పిస్తామని రూ.3 నుంచి రూ.10లక్షల వరకు చెక్కుల రూపంలో తీసుకున్నారు.
పేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న గొప్ప లక్ష్యసాధనలో భాగంగా కూటమి ప్రభుత్వం గృహనిర్మాణ రంగానికి బడ్జెట్లో రూ.6,357 కోట్లు కేటాయించి, తమకంటూ ఒక మంచి ఇల్లు ఉండాలనుకునే పేదల భద్రత, గౌరవానికి మద్ధతుగా నిలుస్తోందని, భవిష్యత్ పై వారి కుండే నమ్మకాన్ని నిజం చేస్తోందని ప్రత్తిపాటి వివరించారు.
శుక్రవారం శాసనసభలో గృహనిర్మాణ రంగానికి నిధుల కేటాయింపులు : ప్రభుత్వ లక్ష్యం అనే అంశంపై జరిగిన చర్చలో మాజీమంత్రి ప్రసంగించారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన – 2.0లో భాగంగా దేశవ్యాప్తంగా 2కోట్ల ఇళ్లనిర్మాణం కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటే, ఎన్టీఆర్ గృహనిర్మాణపథకం : అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఏపీలోని కూటమిప్రభుత్వం 2024- 25 నుంచి, 2028-29 వరకు 17,63,761 గృహాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. పేదల కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం గొప్ప బాధ్యతతో ముందుకు వెళతోంది అనడానికి ఇదే నిదర్శనమని ప్రత్తిపాటి చెప్పారు.
షీర్ వాల్ టెక్నాలజీతో కట్టినందునే నేటికీ టిడ్కో ఇళ్లు చెక్కుచెదరలేదు చిలకలూరిపేటలో 4512 టిడ్కో గృహాలు పూర్తయితే 3వేల ఇళ్లలో నివాసముంటున్నారు.
2014-19 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వం 2,04,600 ఇళ్లను యుద్ధప్రాదిపతికన షీర్ వాల్ పరిజ్ఞానంతో నిర్మించిందని, గత ప్రభుత్వం ఆ ఇళ్లను పూర్తిగా గాలికి వదిలేసినా, నేటికీ అవి చెక్కుచెదరకుండా ఉన్నాయంటే చంద్రబాబు తీసుకొచ్చిన సరికొత్త నిర్మాణ పరిజ్ఞానమే కారణమని ప్రత్తిపాటి తెలిపారు. ఆనాడు ఎలక్ట్రానిక్ డ్రా పద్ధతిలో ఇళ్లను కేటాయిస్తే, గత ప్రభుత్వం ఇష్టానుసారం అనర్హులకు కూడా ఇళ్లు కేటాయించిందన్నారు. చిలకలూరిపేటలో అప్పటి మంత్రి నారాయణ సహకారంతో 4,512 ఇళ్లను డ్రా తీసి లబ్ధిదారులకు కేటాయించడం జరిగిందన్నారు. కూటమిప్రభుత్వం వచ్చాకే ఆ ఇళ్లన్నీ సకల హంగులతో పూర్తిచేసి 3వేల ఇళ్లలో కుటుంబాలు నివాసముండేలా చేయడం జరిగిందన్నారు. మరో 1008 గృహాల్లో చిన్నచిన్న నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. మొత్తం 5520 ఇళ్లన్నీ కుటుంబాలతో నిండిపోతే, అక్కడే దాదాపు 20వేల మంది నివాసముంటారని ప్రత్తిపాటి తెలిపారు.
టిడ్కో గృహ సముదాయాల్లో సకల వసతులు కల్పిస్తేనే నివాసానికి ప్రజలు ఇష్టపడతారు
టిడ్కో గృహాల్లో ఉండటానికి ఇళ్లు పొందినవారు ఆసక్తిగానే ఉన్నారని, కానీ అక్కడ వారికి అవసరమైన వివిధ రకాల మౌలికవసతులు కల్పించాలని కోరుతున్నారని ప్రత్తిపాటి చెప్పారు. విద్య, వైద్య భవనాలు. ప్రార్థనామందిరాలు, దుకాణ సముదాయాలు, కుల చేతి వృత్తుల వారికి అవసరమైన వసతులు, కల్యాణమండపాలు, కమ్యూనిటీ హాళ్లు, శ్మశానం వంటి వాటిపై ప్రజల నుంచి అభ్యర్థనలు వస్తున్నట్టు ప్రత్తిపాటి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఏర్పాట్లు పూర్తయితే ముఖ్యమంత్రి అనుకున్న విధంగా టిడ్కో సముదాయాలు మరో మినీ పట్టణాలను తలపిస్తాయని ప్రత్తిపాటి పేర్కొన్నారు. వేలకోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఇళ్లు పాడైపోకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అదే విధంగా బహుళ అంతస్తుల భవనాలుగా నిర్మించిన టిడ్కో గృహాల్లో లిఫ్టుల సౌకర్యం కూడా ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.
2014-19లో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి
పీఎంఏవై గ్రామీణ్ పథకం కింద గృహనిర్మాణ నిమిత్తం రూ.2.39 లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారులకు అందిస్తున్నాయని, దానిలో బీసీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.75వేలు, రూ.లక్ష వరకు రాయితీ ఇస్తున్నామని, దానిలో జరిగే జాప్యాన్ని ప్రభుత్వం తక్షణమే తొలగించాలని ప్రత్తిపాటి కోరారు. 2014-19లో మొదలుపెట్టిన కొన్ని గృహాలు ఇప్పటికీ అసంపూర్ణంగా ఉన్నాయని, ప్రతినియోజకవర్గంలో ఈ సమస్య ఉందని, చాలాచోట్ల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణదశలోనే నిలిచిపోయాయని ప్రత్తిపాటి తెలిపారు. ఈ తరహా నిర్మాణాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. 2019-24 మధ్యకాలంలో చేపట్టిన గృహ నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులకు బిల్లులు అందుతున్నాయని, 2014-19 మధ్యకాలం నాటి నిర్మాణాల విషయమే ప్రశ్నార్థకంగా మారినందున ప్రభుత్వం తక్షణమే సమస్యపై స్పందించాలన్నారు.
గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటిస్థలాలు ఇవ్వాలన్న నిర్ణయానికి తిరుగులేదు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ప్రభుత్వాన్ని పేదలు జీవితాంతం గుర్తుంచుకునేలా సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ప్రత్తిపాటి తెలిపారు. ఇంటిస్థలాలు లేని గ్రామాల్లోని పేదలకు ఉచితంగా 3 సెంట్లు, పట్టణాల్లోని వారికి 2 సెంట్లు ప్రభుత్వమే అందిస్తుందన్న నిర్ణయం తిరుగులేనిదని ప్రత్తిపాటి కొనియాడారు. ఇళ్ల స్థలాలు కావాలంటూ ఇప్పటికే ప్రజల నుంచి దరఖాస్తులు వస్తున్నాయన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో ఈ తరహా ఆలోచన ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. ఈ ప్రభుత్వం అందించే ఇళ్ల స్థలాల్లో ముందుగానే రోడ్లు, డ్రైనేజ్ లు, విద్యుత్ సౌకర్యం వంటి వసతులు కల్పించాకే పేదలకు స్థలాలు ఇస్తే బాగుంటుందని ప్రత్తిపాటి సూచించారు.
సెంటు పట్టాలు, ఇళ్ల స్థలాల పేరుతో జరిగిన అవినీతిపై ప్రత్యేక విచారణ కమిటీ వేయాలి
చిలకలూరిపేటలో భూ యజమానుల నుంచి ముందే రూ.3 నుంచి రూ.10లక్షలు వసూలు చేశారు.
గత ప్రభుత్వం నివాసానికి పనికిరాని భూములను పేదలకు ఇళ్లస్థలాలుగా ఇచ్చి, వారిని మోసగించిందని, రాష్ట్రంలో ఆనాడు ఇచ్చిన సెంటుపట్టాల్లో చాలావరకు నిరుపయోగంగానే ఉన్నాయని ప్రత్తిపాటి సభకు తెలియచేశారు. చిలకలూరిపేటలో గతపాలకులు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో జరిగిన అవినీతిపై సొంతపార్టీవారే కోర్టులకు వెళ్లారన్నారు. కేవలం ఇళ్లస్థలాల కోసమే 251 ఎకరాల భూమి కొన్నారని, దానిలో భాగంగా ప్రభుత్వం నుంచి అధికధర ఇప్పిస్తామని భూయజమానుల్ని మోసగించి, వారినుంచి ముందే రూ.3 నుంచి రూ.10 లక్షల వరకు చెక్కులు తీసుకొని గత ప్రజాప్రతినిధి, మాజీఅవినీతి మంత్రి భారీ దోపిడీకి పాల్పడ్డారని ప్రత్తిపాటి తెలియ చేశారు. ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో పెద్దఎత్తున అవినీతి జరిగిందన్నారు. చిలకలూరిపేటలో జరిగిన అవినీతిపై మాజీమంత్రి విడదల రజినీ దోపిడినీ నిరసిస్తూ సొంతపార్టీ వారే కోర్టులను ఆశ్రయించడంతో తీసుకున్న సొమ్ము వెనక్కు ఇచ్చారని ప్రత్తిపాటి చెప్పారు. వినుకొండలోనూ ఇదేవిధంగా జరిగిందన్నారు. ఈ వ్యవహారంపై కూటమిప్రభుత్వం వెంటనే ప్రత్యేక విచారణ జరిపించాలని, అందుకోసం విచారణా కమిటీని ఏర్పాటు చేయాలని ప్రత్తిపాటి సభాముఖంగా కోరారు. ఇళ్ల స్థలాల పేరిట గత ప్రభుత్వం చేసిన భారీ దోపిడీని ప్రజల ముందు ఉంచి, అవినీతిపరుల్ని శిక్షిస్తేనే ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న నమ్మకం మరింత బలపడుతుందన్నారు.



