సాగునీటి లిఫ్ట్ ల నిర్వహణపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలి: ప్రత్తిపాటి
- ప్రశ్నోత్తరాల సమయంలో చిలకలూరిపేట ప్రజలు ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి సమస్యను మంత్రి నిమ్మల రామానాయుడికి తెలియచేసిన మాజీమంత్రి ప్రత్తిపాటి.
- నియోజకవర్గ తాగు, సాగునీటి సమస్యకు కీలకమైన లిఫ్టుల నిర్వహణ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం : మంత్రి నిమ్మల.
అమరావతి న్యూస్ చిలకలూరిపేట
పల్నాడు జిల్లాలోని ప్రధాన నియోజకవర్గమైన చిలకలూరిపేట ప్రజలకు సాగు, తాగునీరు అందించే పలు లిఫ్ట్ ల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారిందని, గతంలో కూడా సమస్యను ప్రభుత్వానికి తెలియచేయడం జరిగిందని, సమస్య తీవ్రత దృష్ట్యా మరోసారి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకి తెలియచేస్తున్నానని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.
గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రత్తిపాటి నియోజకవర్గంలోని ఎత్తిపోతల వ్యవస్థ (లిఫ్ట్ లు) నిర్వహణా సమస్యపై మాట్లాడారు.
సాగు, తాగునీటి లిఫ్ట్ ల నిర్వహణా బాద్యతలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తామని గతంలో జలవనరుల శాఖా మంత్రి చెప్పారని, కానీ ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదని ప్రత్తిపాటి తెలిపారు. ప్రైవేట్ ఏజెన్సీలు సాధారణంగా ప్రజల ఇబ్బందుల కంటే వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తాయి కాబట్టి, ప్రభుత్వం వాటికి సకాలంలో డబ్బులు చెల్లించనంతకాలం బాగానే పనిచేస్తాయని, ఏదైనా సమస్యవల్ల నిధుల చెల్లింపు ఆగిపోతే, లిఫ్టుల నిర్వహణ స్తంభించి, ప్రజలకు నీటి కష్టాలు మొదలవుతాయన్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చే లిఫ్ట్ ల నిర్వహణకు గాను, ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, వాటి నిర్వహణను నిఘా ఉంచితే బాగుంటుందని ప్రత్తిపాటి సూచించారు.
నియోజకవర్గంలోని నీటి అవసరాలకు మూడు ప్రధాన వాగులే దిక్కని, నక్కవాగు, కుప్పగంజి, ఓగేరు వాగులపైనే 50 శాతం లిఫ్టుల వరకు ఉన్నాయని ప్రత్తిపాటి చెప్పారు. కానీ ఆ వాగులన్నీ పూడిక, కంపచెట్లతో నిండిపోవడంతో నీటి ప్రవాహానికి ఇబ్బందిగా ఉందని, కాబట్టి ప్రభుత్వం ఏటా వాగులను బాగుచేయడంపై కూడా ఆలోచన చేయాలని ప్రత్తిపాటి సభాముఖంగా విజ్ఞప్తి చేశారు. వాగుల్లో నీటి ప్రవాహాం సాఫీగా ఉన్నప్పుడే లిఫ్టులు నిరాటంకంగా పనిచేస్తాయని, అప్పుడే ప్రజలకు సాగు, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయన్నారు.
త్వరలోనే సమస్య పరిష్కరిస్తాం.. : మంత్రి నిమ్మల
చిలకలూరిపేట నియోజకవర్గంలోని లిఫ్టుల ఆధునికీకరణ, నిర్వహణ అంశాన్ని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గతంలోనే తనకు తెలియచేశారని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం నిర్వహించడం కష్టసాధ్యం కాబట్టి, ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలనే ఆలోచన చేశామని జలవనరుల శాఖమంత్రి నిమ్మల తెలిపారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని, నియోజకవర్గంలోని మూడు వాగులను బాగు చేయించడంపై దృష్టి పెడతామని మంత్రి నిమ్మల స్పష్టంచేశారు.



