కొండవీడు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడంలో ప్రత్తిపాటి అభినవ అణిపోతారెడ్డిగా నిలిచారు: కందుల దుర్గేశ్

  • కొండవీడు ఉత్సవాల నిర్వహణను ముఖ్యమంత్రికి తెలియచేస్తాను : దుర్గేశ్
  • ఈ ప్రాంత అభివృద్ధికోసం గతంలో ప్రత్తిపాటి ప్రభుత్వానికి అందజేసిన రూ.110 కోట్ల డీపీఆర్ ను కేంద్రానికి పంపించాం : దుర్గేశ్
  • తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి వినియోగాన్ని సుబ్బారెడ్డి, వైసీపీనేతలే అంగీకరించారు : దుర్గేశ్
  • కొండవీడు అభివృద్ధికి సహకరిస్తామన్న మంత్రి దుర్గేశ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు : ప్రత్తిపాటి
  • కొండవీడు అభివృద్ధి కోసం రూ.110కోట్లతో తయారుచేసిన డీపీఆర్ కు త్వరగా ఆమోదం లభించేలా చూడాలని మంత్రిని కోరుతున్నా: ప్రత్తిపాటి
  • కోటప్పకొండ ఉత్సవాలనూ జయప్రదం చేయండి : చదలవాడ అరవిందబాబు
  • ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో కొండవీడు అభివృద్ధి : కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ల కృషి వల్లే రాష్ట్రంలో ఈ 18 నెలల్లో అనేక ఉత్సవాలు నిర్వహించామని, ప్రజల జీవితాల్లో కూడా ఉత్సవ వాతావరణ కనిపిస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దుర్గేశ్ తెలియచేశారు. ఈ తరహా ఉత్సవాలు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతాయన్నారు.
ఆదివారం ఆయన కొండవీడు ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా హాజరై, కొండపైన..దిగువన ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు, జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికాశుక్లా, గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ కుర్రా అప్పారావుతో కలిసి వీక్షించారు. అనంతరం కొండపైన ఏర్పాటుచేసిన సభను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగాన్ని వైవీ సుబ్బారెడ్డే అంగీకరించారు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించింది అసలు నెయ్యే కాదని ల్యాబ్ రిపోర్టులు ధృవీకరించాయని, 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వంలోనే ఈ మహాపాపం జరిగిందని దుర్గేశ్ తెలిపారు.
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని సాక్షాత్తూ వైవీ.సుబ్బారెడ్డే అంగీకరించారన్నారు. అదే విధంగా గతంలో అయోద్యకు పంపిన శ్రీవారి లడ్డూలు విషయాన్ని ప్రస్తావిస్తూ వారే కల్తీ నెయ్యిపై నోరుజారారన్నారు. అయోధ్యకు పంపిన లడ్డూలు వేరే చోట నుంచి తెప్పించామని, వాటితయారీలో కల్తీ జరగలేదని చెప్పడం ద్వారా తిరుమల లడ్డూప్రసాదంలో కల్తీ జరిగినట్టు వారు పరోక్షంగా ఒప్పుకున్నారని దుర్గేశ్ అభిప్రాయపడ్డారు.
వైసీపీ నేతల మాటల్లో పొంతన లేదని, రూ.319లకు నాణ్యమైన ఆవునెయ్యి ఎక్కడి నుంచి లభిస్తుందని ఆయన ప్రశ్నించారు. భోలే బాబా డెయిరీ కేంద్రంగానే ప్రత్యేక శ్రద్ధతో కల్తీనెయ్యి తయారుచేయించారని దుర్గేశ్ స్పష్టంచేశారు.

కొండవీడు ఉత్సవాల నిర్వహణ.. విశిష్టతను ముఖ్యమంత్రికి తెలియచేస్తాను..
ఘనమైన చారిత్రక నేపథ్యమున్న కొండవీడు ప్రాంత ప్రాశస్త్యాన్ని తెలియచేసేలా రెండురోజులు కొండవీడు ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు దుర్గేశ్ తెలిపారు. వర్షపు నీటి నిల్వకోసం కొండపై మూడు చెరువులు నిర్మించడం, అవి నిండిన తర్వాత ఆ నీరు కిందకు వెళ్లేలా చేపట్టిన నిర్మాణ శైలి ఎప్పటికీ మర్చిపోలేనిదన్నారు. రాష్ట్రంలోని కళా, సాంస్కృతిక వైభవ పునరుద్ధరణతో పాటు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ లు విశేషంగా కృషి చేస్తున్నారని దుర్గేశ్ కొనియాడారు. రాష్ట్రంలో నిర్వహించే ఉత్సవాలకు ప్రజలు లక్షలాది సంఖ్యలో తరలిరావడానికి కారణం కూటమిప్రభుత్వంపై వారికున్న నమ్మకమే అని ఆయన తెలిపారు.
ఏటా కొండవీడు ఉత్సవాలు నిర్వహించే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వ ఉత్సవాల క్యాలెండర్ లో వాటికి ప్రాచుర్యం కల్పిస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

కొండవీడు ఖ్యాతి విశ్వవ్యాప్తంలో ప్రత్తిపాటి అభినవ అణిపోతారెడ్డిని తలపిస్తున్నారు
చరిత్ర ప్రకారం నాడు రెడ్డిరాజు అణిపోతారెడ్డి కొండవీడుకోట నిర్మాణంతో ఖ్యాతి గడిస్తే, నేడు ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేస్తూ, కొండవీడు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడంలో అభినవ అణిపోతా రెడ్డిగా ప్రత్తిపాటి పుల్లారావు నిలిచారని దుర్గేశ్ కొనియాడారు.
ఆయన సంకల్పం సామాన్యమైంది కాదన్న దుర్గేశ్.. ఈ తరహా ఉత్సవాలు, ప్రజలు మెచ్చేలా మౌలిక సదుపాయాల కల్పన చేపట్టడం ఎంతో శ్రమతో కూడిందన్నారు. ఘాట్ నిర్మాణం చూసి ఆశ్చర్యపోయానన్నారు. ఎవరైతే అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తారో అలాంటి నాయకులే చరిత్రలో, ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని దుర్గేశ్ స్పష్టంచేశారు.

కొండవీడు అభివృద్ధికి ప్రత్తిపాటి రూపొందించిన డీపీఆర్ ను కేంద్రప్రభుత్వానికి పంపాం
కొండవీడు ప్రాంత అభివృద్ధికోసం గతంలోనే మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఒక డీపీఆర్ తయారు చేశారని, దానిని పర్యాటక శాఖ పరిశీలించి, నిన్ననే కేంద్ర ప్రభుత్వానికి పంపించామని దుర్గేశ్ చెప్పారు. కొండవీడు విశిష్టత దృష్ట్యా, ఆ డీపీఆర్ కు త్వరలోనే ఆమోదం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ షిప్ లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ 18 నెలల్లో సుమారు రూ.30వేలకోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, అదేవిధంగా కొండవీడు కోట అభివృద్ధికి తన వంతు సహాకారంగా రూ.100 కోట్లు ఇస్తానని గోల్కొండ హోటల్స్ అధినేత నడికట్టు రామిరెడ్డి ముందుకురావడం నిజంగా చాలా గొప్పవిషయమని దుర్గేశ్ పేర్కొన్నారు.

కొండవీడు అభివృద్ధికి సహకరిస్తానన్న మంత్రి దుర్గేశ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు : ప్రత్తిపాటి పుల్లారావు

కొండవీడు అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, కొండపై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి, వేంకటేశ్వరస్వామి దేవాలయాల అభివృద్ధి, శివాలయం నిర్మాణానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సభాముఖంగా హామీ ఇచ్చారని ప్రత్తిపాటి చెప్పారు.
నేడు పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ మరో శుభవార్త చెప్పారని, కొండవీడు ప్రాంత అభివృద్ధి నిమిత్తం తయారుచేసిన 110 కోట్ల డీపీఆర్ ను కేంద్రప్రభుత్వానికి పంపినట్టు తెలియచేశారన్నారు. డీపీఆర్ కు త్వరగా ఆమోదం లభించేలా చూడాలని ఈ సందర్భంగా మంత్రికి విజ్ఞప్తిచేస్తున్నట్టు ప్రత్తిపాటి తెలిపారు. కొండవీడు కోట చారిత్రక సంస్కృతిని, వైభవాన్ని కాపాడేందుకు తనవంతు చేయూత ఎల్లప్పుడూ అందిస్తానని దుర్గేశ్ చెప్పారన్నారు.
నిబద్ధత కలిగిన మంత్రి కందుల దుర్గేశ్ అని, ఆయన సహకారంతో త్వరలోనే కొండవీడులో 30 కాటేజెస్ నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు.
అటవీశాఖ పరిధిలో కొండవీడు కోట ఉన్నందున, దీని అభివృద్ధికోసం అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఏకకాలంలో సమన్వయంతో పనిచేయాలని ప్రత్తిపాటి కోరారు. కొండవీడును ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది, అమరావతిలోనే బెస్ట్ టెంపుల్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాలని గతంలోనే ప్రకటించారన్నారు. కొండపైన అభివృద్ధికి పర్యాటక శాఖ తరుపున తగిన సహయ సహకారాలు అందిస్తామని సభాముఖంగా తెలియచేసిన మంత్రి కందుల దుర్గేశ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్టు ప్రత్తిపాటి చెప్పారు. కోటప్పకొండ తిరునాళ్లను కూడా కనివినీ ఎరుగని విధంగా విజయవంతం చేద్దామని ఈ సందర్భంగా ప్రత్తిపాటి పిలుపునిచ్చారు.

కోటప్పకొండ ఉత్సవాలనూ జయప్రదం చేయండి : చదలవాడ అరవిందబాబు

కోటప్పకొండ ఉత్సవాలు 15వ తేదీన నిర్వహిస్తున్నామని, వాటిని కూడాప్రజలు విజయవంతం చేయాలని నరసరావుపేట శాసనసభ్యులు అరవిందబాబు కోరారు. కోటప్పకొండ ఉత్సవాలకు తప్పకుండా రావాలని ఆయన ఈ సందర్భంగా మంత్రి దుర్గేశ్ ను సభాముఖంగా ఆహ్వానించారు. త్వరలో జరిగే కోటప్పకొండ ఉత్సవాలకు 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశామని, అలానే 30 నుంచి 40వరకు భారీస్థాయిలో విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేస్తారని అరవిందబాబు తెలిపారు. కొండవీడుచరిత్ర ఘనతను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలియచేయాలన్నారు.

ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో కొండవీడు అభివృద్ధి : జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా

2019 తర్వాత, ఇన్నేళ్లకు మరలా కొండవీడు ఉత్సవాలు నిర్వహించాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారని, మూడు వారాల్లోనే అన్ని ఏర్పాట్లు చేసి, ప్రభుత్వ సహకారంతో ఉత్సవాలను విజయవంతం చేశామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు.
కొండవీడు కోటపై ఉన్న నిర్మాణాలు వీక్షించడానికే ప్రత్యేకంగా హెలీ రైడ్ ఏర్పాటు చేశామని, ఉత్సవాల అనంతరం కూడా పర్యాటకులు కొండపై విడిదిచేసే ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె చెప్పారు. అందులో భాగంగా తొలుత టెంట్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించామన్నారు. కొండవీడుపై పర్యాటకుల కోసం సౌకర్యాలు కల్పించేందుకు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని కూడా ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. పర్యాటకుల వసతికోసం వచ్చే ఉత్సవాల నాటికి కొండపైన తొలుత 30 గదులు నిర్మించాలని నిర్ణయించినట్టు కలెక్టర్ తెలియచేశారు. రాత్రి పూట ప్రశాంతంగా, ఆహ్లాదంగా గడిపేందుకు కొండవీడు ఎంతో బాగుంటుందని, ఈ ప్రదేశాన్ని భవిష్యత్ లో వెడ్డింగ్ డెస్టినేషన్ గా మార్చే ప్రయత్నాలు ఇప్పటినుంచే ప్రారంభించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. నేటి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని తలదన్నేలా కొండవీడు నిర్మాణ శైలి ఉందని, దానియొక్క విశిష్టతను విద్యార్థులు, యువత తప్పకుండా తెలుసుకోవాలని ఆమె సూచించారు.

మంత్రి ..ఎమ్మెల్యేలు.. కలెక్టర్ బోట్ షికారు : పుష్ప, ఫలాకృతులు, శాండ్ ఆర్ట్ పరిశీలన.. నిర్వాహకులకు అభినందనలు

రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి, అరవిందబాబు, జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా లను అధికార యంత్రాంగం ఘన స్వాగతంతో ఆహ్వానం పలికింది. కొండపైకి వెళ్లిన అనంతరం మంత్రి , ఎమ్మెల్యేలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఉద్యానవన శాఖ ఏర్పాటుచేసిన ప్రత్యేక పుష్ప, ఫలాకృతిని పరిశీలించారు. శాండ్ ఆర్ట్ ను పరిశీలించి నిర్వాహకుల్ని అభినందించారు. అనంతరం ఫుడ్ కోర్టును పరిశీలించి, ఆహారపదార్థాల నాణ్యత ఎలా ఉందని పర్యాటకుల్నిఅడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించిన మంత్రి, ఎమ్మెల్యేలు వారిని ముద్దుచేసి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వారు కొండపైన చెరువులో ఉల్లాసంగా బోటింగ్ షికారు చేశారు.

Share.
Leave A Reply