అద్భుతమైన నిర్మాణాలు.. శిల్పకళ, చిత్రకళ, జలకళకు ప్రతీక కొండవీడు
- కొండవీడు ఉత్సవాల తొలిరోజు వేడుకలను లాంఛనంగా ప్రారంభించిన కేంద్రమంత్రి పెమ్మసాని, మంత్రి ఆనం, ఎంపీలావు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి
- ఉత్సవాల తొలిరోజు సాయంత్రం ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, నరసరావు పేట శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు, కన్నా లక్ష్మీనారాయణ, జీడీసీసీ ఛైర్మన్ మక్కెన మల్లిఖార్జున రావు
- కోటపై ఏర్పాటు చేసిన వినోద, సాహస, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించి, అధికారులను పేరుపేరునా అభినందించిన ప్రజాప్రతినిధులు
- కేంద్రమంత్రి, దేవాదాయమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు ఘనస్వాగతం పలికి, ఉత్సవాల విశిష్టతను స్వయంగా తెలియచేసిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఇతర అధికారులు
- తెలివైన ప్రణాళికలు, దూరదృష్టి నిర్మాణాలకు ప్రతీకలు కొండవీడు నిర్మాణాలు : కేంద్రమంత్రి పెమ్మసాని
- కొండవీడు వైభవాన్ని, చరిత్రను భావితరాలకు తెలియచేయాలి : ఎంపీ లావు
- అద్భుత జల నిర్మాణాల సౌథం కొండవీడు : మంత్రి ఆనం
- ముఖ్యమంత్రి ఆశయసాధనలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కొండవీడుకు పూర్వవైభవం తీసుకొస్తాం : ప్రత్తిపాటి
- కొండవీడు అభివృద్ధికి రూ.100 కోట్లు అయినా ఇవ్వడానికి సిద్ధమన్న పారిశ్రామికవేత్త నడికట్టు రామిరెడ్డి ఉదారతను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: ప్రత్తిపాటి
రెడ్డిరాజుల ఏలుబడిలో ఆనాడే తెలుగు సాహిత్యం, చిత్రకళ, శిల్పకళ, యుద్ధ నైపుణ్యాలకు, శత్రు రక్షణకు ప్రధాన స్థావరంగా కొండవీడు కోట నిలిచిందని, ఇక్కడ చేసేది సామాన్య ట్రెక్కింగ్ కాదని, మన చరిత్రతో సంభాషిస్తూ, మన పూర్వీకులతో కలిసి అడుగులు వేయడం అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
కొండవీడు ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఆయన అతిథులు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, స్థానిక శాసనసభ్యులు, మాజీమంత్రి ప్రత్తిపాటితో కలిసి కొండవీడు ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. తొలుత ఉత్సవాలకు విచ్చేసిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీ లావు, ఎమ్మెల్యే ప్రత్తిపాటికి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉత్సవాల ప్రాంగంణంలో ఏర్పాటుచేసిన వేదికపై నుంచి వారు ప్రసంగించారు.
తెలివైన ప్రణాళికలు, దూరదృష్టి నిర్మాణాలకు ప్రతీకలు కొండవీడు నిర్మాణాలు : కేంద్రమంత్రి పెమ్మసాని
కొండవీడు వైభవానికి ఎంతో విశిష్టత ఉందని, తెలివైన ప్రణాళికతతో దూరదృష్టితో ఇక్కడి నిర్మాణాలున్నాయని పెమ్మసాని ప్రశంసించారు. శత్రు రక్షణతో పాటు, జలసంరక్షణ చర్యలకు కొండవీడు కేంద్రంగా నిలవడం నిజంగా గర్వించాల్సిన అంశమన్నారు. కొండపైన ఎప్పుడూ నీరు ఉండేలా మూడు చెరువుల నిర్మించడం సామాన్య విషయం కాదన్నారు. సాంస్కృతిక వైభవంతో పాటు, ప్రకృతితో మమేకమయ్యేలా కోట నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఇటువంటి ఘన చరిత్రను భావి తరాలకు తెలియచేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుల కృషి అభినందనీయమని పెమ్మసాని అభిప్రాయపడ్డారు. గతంలో 2014-19లో కొండవీడు ఘాట్ రోడ్డు నిర్మించారని, దానివల్లే పర్యాటకుల తాకిడి పెరిగిందన్నారు. కులాల కంపుతో మగ్గిపోతున్న సమాజ రక్షణే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని, ఆయన అన్ని మతాలు, కులాల ఆచారాలు, సాంప్రదాలు, సంస్కృతిని అమితంగా గౌరవిస్తారని పెమ్మసాని తెలిపారు. మన సంస్కృతిని గౌరవించాలన్న ప్రత్తిపాటి సూచన మేరకే ఉత్సవాలకు రావడం జరిగిందన్నారు. కోట నిర్మాణంలోని రాళ్లు మాట్లాడినంతకాలం కొండవీడు చరిత్ర శాశ్వతంగా నిలుస్తుందని, ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. గోల్కొండ హోటల్స్ అధినేత నడికట్టు రామిరెడ్డి కొండవీడు అభివృద్ధికి ముందుకు వచ్చినందుకు ఈ ప్రాంత ప్రజల తరుపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నట్టు పెమ్మసాని పేర్కొన్నారు.
అద్భుత జల నిర్మాణాల సౌథం కొండవీడు : మంత్రి ఆనం
రాష్ట్రంలో ఇప్పుడు జరిగే జలాశయాల అభివృద్ధి మనం చూస్తున్నామని, కానీ మన పూర్వీకులు, కొండపైన ఏడాది పొడవునా జలకళ ఉండేలా చెరువులు నిర్మించడం ఆషామాషీ విషయం కాదని దేవాదాయ శాఖమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఇంజనీరింగ్ నిపుణులు, సర్ అర్థర్ కాటన్ వంటి మేథావులు లేని రోజుల్లో ఇంతటి అద్భుత జల నిర్మాణాలు చేయడం నిజంగా గర్వించాల్సిన అంశమన్నారు. ఇంతటి గొప్ప నిర్మాణ శైలి, విశిష్టతల కలయికైన కొండవీడు వైభవం కచ్చితంగా భావితరాలకు తెలియచేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఆనం స్పష్టం చేశారు. ఉత్సవాల నిర్వహణలో భాగంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని, ఇంతటి గొప్ప ఆలోచనను కార్యరూపం దాల్చేలా కృషిచేసిన స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి, ఎంపీ లావు, కలెక్టర్ కృతికా శుక్లా, ఇతర అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్నట్టు ఆనం తెలిపారు.
కొండవీడు వైభవాన్ని, చరిత్రను భావితరాలకు తెలియచేయాలి : ఎంపీ లావు
ఇటీవలే ఎమ్మెల్యే ప్రత్తిపాటి ఆధ్వర్యంలో భారీఎత్తున లక్షలాది సమక్షంలో ఎడ్లపందేలు నిర్వహించారని, అవి ప్రజలకు వినోదాన్న అందిస్తే..నేడు నిర్వహిస్తున్న కొండవీడు ఉత్సవాలు మన చారిత్రక వైభవాన్ని నేటియువతకు తెలియచేసే గొప్ప కార్యక్రమమని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు.
కొండవీడు కోటపై జంతుప్రదర్శన శాల ఏర్పాటు చేయాలని నిర్ణయించాం
కొండవీడు చరిత్ర, మాచర్ల పల్నాటి యుద్ధచరిత్ర, నాగార్జున కొండపైనున్న నిర్మాణాలు మన జిల్లా పూర్వ చరిత్రను, చారిత్రక వైభవాన్ని జిల్లా విద్యార్థులు, యువత తప్పనిసరిగా తెలుసుకోవాలని ఎంపీ లావు సూచించారు. ఉత్సవాల్లోని సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు అనుభూతి చెందడంతో పాటు.. కొండవీడు వైభవం గొప్పతనాన్ని అందరూ తెలుసుకోవాలన్నారు. విద్యాసంస్థల అధ్యాపకులు కొండవీడు వైభవాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. కొండవీడు ఘాట్ రోడ్డు అంతటి రోడ్డు ఈ ఆరేడు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎక్కడా వేసిన దాఖలాలు లేవన్నారు. అటవీప్రాంతంలో ఉన్న కొండవీడు కోటపై ఒక జంతు ప్రదర్శన శాల ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దానిపై కేంద్రప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతాం.ఎకో టూరిజం కేంద్రంగా కొండవీడును అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి ఎప్పటినుంచో అనుకుంటున్నారని ఎంపీ లావు తెలిపారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధుల సహకారంతో కొండవీడుకు పూర్వవైభవం తీసుకొస్తాం : ప్రత్తిపాటి
కొండవీడు కోట రెడ్డిరాజులు, శ్రీకృష్ణదేవరాయలు, కాకతీయులు, ముస్లిం చక్రవర్తుల పాలనా వైభవానికి ప్రతీకగా నిలిచిన గొప్ప చారిత్ర కేంద్రమని, ఇంతటి ఘనచరిత్ర కలిగిన ప్రాంతం గనుకే అన్ని విధాల అభివృద్ధి చేయాలని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన చేశారని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలియచేశారు. 2014-19 మధ్య చంద్రబాబు రూ.40 కోట్లతో కొండపైకి అద్భుతమైన ఘాట్ రోడ్డు వేయించారని, తర్వాత కొండపైన అభివృద్ధికి రూ.20 కోట్లు కేటాయించారని ప్రత్తిపాటి తెలిపారు. తర్వాత ప్రభుత్వం మారడంతో కోట అభివృద్ధి పడకేసిందన్నారు. ఎంపీ లావు సహకారంతో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేయూతతో కొండవీడుకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రత్తిపాటి ఈ సందర్భంగా తెలియచేశారు. పారిశ్రామికవేత్త నడికట్టు రామిరెడ్డి కొండవీడు అభివృద్ధికి రూ.100 కోట్లైనా ఇవ్వడానికి సిద్ధమని చెప్పడం నిజంగా చాలా గొప్ప విషయమని, ఆయన ఉదారతను ఎంత పొగిడినా తక్కువే అవుతుందని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు.
కొండవీడు కోటపై ఉన్న ప్రతి నిర్మాణం చరిత్రకు ఆనవాలే
కోటపై ఉన్న విగ్రహాలు, శాసనాలు, రాతి కట్టడాలు, ప్రత నిర్మాణం గత చరిత్రకు ఆనవాళ్లని, ఇలాంటి ప్రదేశాన్ని అమరావతి రాజధాని సమీపంలోనే గొప్ప పర్యాటక, చారిత్రక ప్రదేశంగా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు ప్రధాన ఆశయమని ప్రత్తిపాటి పేర్కొన్నారు. భవిష్యత్ లో కొండవీడును డెస్టినేషన్ మ్యారేజ్ కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తామని ప్రత్తిపాటి చెప్పారు. కొండవీడు ఉత్సవాలను ఇంతభారీ స్థాయిలో ఏర్పాటుచేసిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఆర్డీవో మధులత, డీఎఫ్.ఓ మధులత సహా అధికారులందరికీ పేరుపేరునా ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్నట్టు ప్రత్తిపాటి చెప్పారు.
ఉదయం జరిగిన ఉత్సవాలకు ప్రత్యేక అతిథులుగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు హాజరవ్వగా, సాయంత్రం ప్రత్యేక అతిథులుగా చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, నరసరావు పేట శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు, కన్నా లక్ష్మీనారాయణ, జీడీసీసీ ఛైర్మన్ మక్కెన మల్లిఖార్జున రావులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో మండల, గ్రామ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.



