చిలకలూరిపేట బస్టాండ్‌లో ‘టెండర్’ ప్రకారం అమ్మకాలు లేవు?
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు!
చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్‌లో దుకాణదారుల మధ్య వివాదం ముదురుతోంది. నిబంధనల ప్రకారం వ్యాపారాలు సాగాల్సిన చోట, కొందరు అధికారుల అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఆరు నెలలుగా ఈ సమస్య కొనసాగుతున్నా, స్థానిక అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల పక్షపాత వైఖరి – బాధితుల ఆవేదన
బస్టాండ్‌లో దుకాణాలు నిర్వహించే వారు నెలకు లక్షల రూపాయల అద్దెలు చెల్లిస్తున్నారు. అయితే, టెండర్ నిబంధనల ప్రకారం ఏ వస్తువులు అమ్మాలి, ఏవి అమ్మకూడదు అనే నిబంధనలను కొందరు యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. దీనివల్ల నిబంధనలు పాటించే వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. “ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరొక న్యాయమా?” అంటూ బాధితులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ గొడవలు పలుమార్లు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినా పరిష్కారం లభించలేదు.
విచారణ పేరుతో కాలయాపన?
మరో విచారకరమైన విషయం ఏమిటంటే, అక్కడే పనిచేస్తున్న ఒక ఉద్యోగి తన భార్య పేరుతో దుకాణం తీసుకుని, నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తూ ఇతర వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై స్థానిక డిపో మేనేజర్ (DM) ను వివరణ కోరగా, “ప్రస్తుతం విజిలెన్స్ విచారణ జరుగుతోంది, అది పూర్తయ్యే వరకు మేము ఏమీ చేయలేము” అంటూ సమాధానం ఇవ్వడం గమనార్హం. జిల్లా మరియు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వ్యాపారులు కోరుతున్నారు.



