ప్రత్యేక పనితీరుతో ప్రజల్లో మంచి గుర్తింపు పొందాలి : ప్రత్తిపాటి
- ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియలో పాల్గొన్న ప్రత్తిపాటి
- టీడీపీ అభ్యర్థులను అభినందించి, వారికి కీలక సూచనలు చేసిన ఎమ్మెల్యే
టీడీపీ ఎంపిక చేసిన పంచాయతీ, ఎంపీటీసీ అభ్యర్థులు ప్రత్యేక పనితీరుతో ప్రజల్లో మంచి గుర్తింపు పొందాలని, అధినాయకత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.
బుధవారం చిలకలూరిపేట మండలంలోని 15 మంది టీడీపీ ఎంపీటీసీల నామినేషన్ల ప్రక్రియలో మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ప్రత్తిపాటి సమక్షంలో అభ్యర్థులంతా ఒకేసారి నామినేషన్లు వేయడానికి రావడంతో ఆ ప్రాంతంలో కోలాహాలం నెలకొంది. నామినేషన్లకు ముందే అభ్యర్థులను పేరుపేరునా అభినందించి, వారిక శుభాకాంక్షలు తెలియచేసిన అనంతరం ఆయన మాట్లాడారు.
ప్రజలకు సుపరిచితులైన, సమర్థులైన అభ్యర్థులనే ఎంపీటీసీ స్థానాలకు ఎంపిక చేశామని, గెలిచిన తర్వాత వారు తమ పనితీరు, సమర్థతతో ఉత్తమ రాజకీయ నాయకులుగా ఎదగాలని ప్రత్తిపాటి ఆకాంక్షించారు. మండల, గ్రామస్థాయి పరిపాలన, అభివృద్ధి పర్యవేక్షణ, ప్రజా సంబంధాల్లో ఎంపీటీసీ సభ్యులు ముఖ్యపాత్ర పోషించాలని ఆయన సూచించారు.



