చిలకలూరిపేట మున్సిపల్ ఎన్నికలలో కూటమి అభ్యర్థి తరఫున ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు మల్లెల శివ నాగేశ్వరరావు

ప్రజా వ్యతిరేకతకు భయపడే వైసీపీ పోటీకి దూరమైంది : ప్రత్తిపాటి

  • 1, 2, 3 వార్డుల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ప్రత్తిపాటి.
  • కూటమి ఛైర్ పర్సన్ అభ్యర్థి, శ్రీమతి తోట రాజరాజేశ్వరి, జనసేన ఇన్ ఛార్జ్ తోట రాజారమేశ్ లతో కలిసి విస్తృత ప్రచారం చేపట్టిన ప్రత్తిపాటి
  • ప్రజాభిమానం, ఆదరణ చూస్తుంటే. అన్నివార్డుల్లో కూటమి భారీ మెజారిటీతో గెలుస్తుందనే తమ నమ్మకం బలపడింది :ప్రత్తిపాటి
  • కూటమి ప్రభంజనంతో వైసీపీకి అభ్యర్థులు దొరకని దుస్థితి :ప్రత్తిపాటి
  • ఎన్నికల్లో పోటీచేయాలనే ఆసక్తి వైసీపీలో కనిపించడం లేదు : ప్రత్తిపాటి
  • పరువుకోసం బలవంతపెట్టి, ఇష్టంలేని వారితో పోటీ చేయిస్తున్నారు. : ప్రత్తిపాటి
  • ప్రజలు ఎక్కడా వైసీపీ ఊసే ఎత్తడం లేదు : తోట రాజరాజేశ్వరి

విజయదశమినాడు మున్సిపాలిటీలో చేపట్టిన ప్రచారం కూటమికి తిరుగులేని విజయాన్ని అందించబోతోందని, ప్రజల ఆదరణ, అభిమానం చూస్తుంటే, అన్నివార్డుల్లో కూటమి అభ్యర్థులు భారీ విజయం సాధిస్తారనే తమ నమ్మకం మరింత బలపడిందని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. నామినేషన్ల ఘట్టం ముగియడంతో విజయదశమిని పురస్కరించుకొని చిలకలూరిపేట పట్టణంలో కూటమి అభ్యర్థులతో కలిసి ప్రత్తిపాటి మంగళవారం సాయంత్రం ప్రచారాన్ని ప్రారంభించారు. స్థానిక జనసేన, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కూటమి ఛైర్ పర్సన్ అభ్యర్థి తోట రాజరాజేశ్వరి, జనసేన ఇన్ చార్జ్ తోట రాజారమేశ్ లతో కలిసి ప్రత్తిపాటి 1, 2, 3 వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి ప్రజలతో మమేకమై, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనా విజయాలను వారికి వివరిస్తూ, తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ‘చెప్పాం.. చేస్తున్నాం’ ప్రచార పత్రాలను అందించి వారి అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి తోట రాజరాజేశ్వరి, 1వ వార్డు అభ్యర్థి నంగినేని సుజాత, 2వ వార్డు అభ్యర్థి తుమ్మల బెనర్జీ, 3వ వార్డు అభ్యర్థి శిఖా మరియమ్మలను స్వయంగా పట్టణవాసులకు పరిచయం చేస్తూ, ఆమెను, కూటమి అభ్యర్థుల్ని గెలిపిస్తే పట్టణ ప్రజలకు కలిగే ప్రయోజనాల్ని స్వయంగా వారికి వివరించారు. అనంతరం ప్రత్తిపాటి, కూటమి అభ్యర్థి తోట రాజరాజేశ్వరి విలేకరులతో మాట్లాడారు.

స్థానిక ఎన్నికల్లో కూటమి విజయంతో.. రాష్ట్రలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధి
ఎన్నికల బరిలో నిలిచి ప్రజాక్షేత్రంలో పోరాడలేకే వైసీపీ చాపచుట్టేసిందని, ప్రజల స్పందన చూస్తుంటే కూటమి అభ్యర్థుల విజయంపై తమకున్న నమ్మకం మరింత బలపడిందని ప్రత్తిపాటి తెలిపారు. పండుగనాడు ప్రారంభించిన ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన కనిపించిందన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయంతో రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ పాలన మొదలు కానుందన్నారు. కేంద్రం..రాష్ట్రంతో పాటు. ఇకపై స్థానిక ఎన్నికల్లో కూటమి సుపరిపాలన, రెట్టింపు అభివృద్ధి ప్రజలకు మరింత చేరువ అవుతుందని ప్రత్తిపాటి చెప్పారు. ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రజలు మంచి నమ్మకంతో ఉన్నారని, తమకు కావాల్సినవన్నీ సకాలంలో నెరవేరుస్తూ, సమస్యలు పరిష్కరిస్తున్నారనే అభిప్రాయం వారిలో స్పష్టంగా కనిపిస్తోందని ప్రత్తిపాటి పేర్కొన్నారు.

పరువు పోకూడదని వైసీపీ బలవతంగా అభ్యర్థుల్ని పోటీకి దింపుతోంది.
ఎన్నికల్లో పోటీకి వైసీపీ అభ్యర్థులు ఎవరూ సుముఖంగా లేరని, వారిలో ఎక్కడా ఆసక్తి కనిపించడం లేదని ప్రత్తిపాటి చెప్పారు. పరువుకోసం పార్టీ ఒత్తిడికి తలొగ్గి, నిరాసక్తితో అయిష్టంగా పోటీ చేస్తున్నారని, ప్రచారంలో ప్రజాదరణ లేక వెనుదిరుగుతున్నారని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజల్లో పార్టీపై సదభిప్రాయం, సానుకూలత లేనప్పుడు పోటీ చేయడం ఎందుకని స్వయంగా ఆ పార్టీ అభ్యర్థులే ప్రశ్నించుకుంటున్నారని ఆయన తెలిపారు. ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలనే నిశ్చితాభిప్రాయానికి వచ్చారన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని గట్టిగా కోరుకుంటున్న ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా కూటమినే తిరుగులేని మెజారిటీతో గెలిపించబోతున్నారని ప్రత్తిపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు తమ పక్షాన ఉన్నందునే ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు, 100కు పైగా డివిజన్లు ఏకగ్రీవమయ్యాయని ఆయన తెలిపారు.

ప్రజలు వైసీపీ ఊసే ఎత్తడం లేదు : తోట రాజరాజేశ్వరి
పట్టణంలో ఎక్కడ చూసినా కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమంపైనే చర్చ జరుగుతోందని.. ప్రజలు వైసీపీ అభ్యర్థుల ఊసే ఎత్తడం లేదని తోట రాజరాజేశ్వరి తెలిపారు. ప్రత్తిపాటి నాయకత్వంలో పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతోందని, కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు ఎంతగా మేలు చేస్తున్నాయో ఒకసారి ప్రజలు ఆలోచించాలని ఆమె కోరారు.

ప్రచార కార్యక్రమంలో జనసేన ఇంచార్జి తోట రాజరమేష్, మండలనేని చరణ్ తేజ్, పెంటేలా బాలాజీ, టీడీపీ నియోజకవర్గ అబ్జార్వార్ ఆడక స్వాములు, సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, నెల్లూరి రంజిత్, గట్టా హేమ, టీడీపీ క్లస్టర్ ఇంచార్జి షేక్ ముల్లా కరిముల్లా, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply