జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడుగా వైసీపీ నేత
ఈ నెల 23న నరసరావుపేటలో తండ్రీకొడుకుల కిడ్నాప్, హత్య
బెంగళూరు నుంచి కోర్టు పని మీద వచ్చిన సమయంలో ఘటన
సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు
దర్శి నియోజకవర్గ వైసీపీ మాజీ ఇన్ చార్జి మాధవరెడ్డి ప్రధాన నిందితుడుగా గుర్తింపు
పల్నాడు జిల్లాలో ఇటీవల జరిగిన జంట హత్యలు తీవ్ర కలకలం రేపిన విషయం విదితమే. ఈ కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ నెల 23న నరసరావుపేటలో ఇద్దరు రియల్టర్లు (తండ్రీకొడుకులు) దారుణ హత్యకు గురయ్యారు.
ఈ హత్యలకు సూత్రధారి వైకాపా నేత బాదం మాధవరెడ్డి అని పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిర్ధారణకు వచ్చారు. కిడ్నాప్, హత్యలో మాధవరెడ్డితో పాటు మరో ఆరుగురు పాల్గొన్నట్లు గుర్తించారు. మాధవరెడ్డి గతంలో దర్శి నియోజకవర్గ వైకాపా ఇన్‍ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు.
విషయంలోకి వెళితే.. బెంగళూరులో నివాసం ఉంటున్న కె. వీరస్వామి రెడ్డి (62), ఆయన కుమారుడు కె.వి. ప్రసాదరెడ్డి (37) ఇటీవల కోర్టు పని మీద పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణానికి వచ్చారు. ఈ నెల 23న ఉదయం వారు కోర్టుకు బయలుదేరుతుండగా, వాహనంలో వచ్చిన ఆరుగురు వ్యక్తులు తండ్రీకొడుకులను కిడ్నాప్ చేశారు. అనంతరం అక్కడి నుంచి వారిని పాతమాగులూరులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌లోకి తీసుకెళ్లి ఇద్దరినీ దారుణంగా హత్య చేసి పారిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.



