ఈవ్ టీజింగ్‌కు పాల్పడిన వారిని పై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం : అర్బన్ సీఐ రమేష్

చిలకలూరుపేట: పట్టణంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థినుల భద్రతకు సంబంధించి అర్బన్ సీఐ పి. రమేష్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో గాంధీనగర్, సుబ్బయ్యతోట, శారదా హైస్కూల్, ఈస్ట్ క్రిస్టియన్ పేట, బీఆర్ఐజీ పండరీపురం వంటి అనేక విద్యాసంస్థలు ఉన్నాయని, ఇక్కడ చాలా మంది యువత చదువు నిమిత్తం పాఠశాలలకు, కళాశాలలకు వస్తున్నారని ఆయన తెలిపారు.

కొంతమంది ఆకతాయిలు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే, వచ్చే సమయాల్లో ఆ సెంటర్ల వద్ద నిలబడి ఈవ్ టీజింగ్‌కుపాల్పడుతున్నారని సమాచారం అందిందని సీఐ రమేష్ వెల్లడించారు. ఈ సమాచారం నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో కొన్ని టీమ్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ టీమ్‌లు ప్రతిరోజు అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

“ఈవ్ టీజింగ్‌కు పాల్పడిన వారిని తీసుకువచ్చి సరిగా కౌన్సిలింగ్ చేసి పంపిస్తున్నాం. కానీ, మరలా ఇలాంటి ఘటనలు పునరావృతమైతే, అటువంటి వ్యక్తులపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే కేసులు కూడా నమోదు చేస్తాం,” అని సీఐ రమేష్ హెచ్చరించారు.విద్యార్థులంతా మైనర్లు అని, వారి జోలికి వెళ్లొద్దని ఆయన యువతకు సూచించారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్తులో మంచి స్థానాల్లో ఉండాలనే ఆశయంతో వస్తున్నారని, అటువంటి వారిని రోడ్లపైన నిలబడి ఈవ్ టీజింగ్ చేయడం హేయమైన చర్య అని ఆయన ఖండించారు. ఇకపై రోడ్ల మీద ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులు కనిపించినట్లయితే, చట్టపరంగా కఠినమైన చర్యలుతీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తొలి హెచ్చరికగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామని, ఈసారి రిపీట్ అయితే కచ్చితంగా కేసులు నమోదు చేస్తామని సీఐ రమేష్ తెలిపారు.

Share.
Leave A Reply