కూటమి ప్రభుత్వానికి అభిప్రాయబేధాల కంటే అభివృద్ధే ముఖ్యం : ప్రత్తిపాటి

  • 15వ ఆర్థిక సంఘం నిధులతో అత్యవసర పనులు చేపట్టండి.
  • బీ.పీ.ఎస్ & ఎల్. ఆర్.ఎస్ నిధులతో ప్రజల మౌలిక అవసరాలు తీర్చండి.
  • పట్టణంలోని బావుల్ని శుభ్రపరిచి.. ప్రజలు వినియోగించుకునేలా చేయండి.
  • తక్షణమే రోడ్లు.. కాలువలపై ఉన్న ఆక్రమణల్ని తొలగించాలి.
  • పట్టణ ప్రగతి.. ప్రజాసమస్యల పరిష్కారంపై మున్సిపల్ అధికారులు..కౌన్సిలర్లతో ప్రత్తిపాటి సమీక్ష.

పురపాలక అధికారులు… సిబ్బంది.. కౌన్సిలర్లు పట్టణాభివృద్ధి, ప్రజాసమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, చెత్తసేకరణ వీధిలైట్లు రోడ్లు.. డ్రైనేజ్ ల నిర్మాణం.. కాలువల శుభ్రత.. తాగునీటి సరఫరాపై ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాలని మాజీమంత్రి. శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశించారు.

స్వార్థపరుల బేధాభిప్రాయాల కంటే అభివృద్దే ముఖ్యం

స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఆయన వార్డు కౌన్సిలర్లు, అధికారులతో పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధిపనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తమ వార్డుల్లోని సమస్యలపై కౌన్సిలర్లు ప్రత్యేక దృష్టిపెట్టాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో చురుగ్గా వ్యవహరించాలని ప్రత్తిపాటి సూచించారు. ఇతర పార్టీల కౌన్సిలర్లు చెప్పినా..చెప్పకపోయినా స్థానికులతో మాట్లాడి ఆయా వార్డుల్లోని సమస్యల్ని కూడా అధికారులే పరిష్కరించాలన్నారు. కూటమిప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుంది, ప్రజాభిప్రాయాలను గౌరవిస్తుంది తప్ప… స్వార్థపరుల బేధాభిప్రాయాలను కాదని ప్రత్తిపాటి స్పష్టం చేశారు.

రూ.5.40 కోట్లతో రోడ్లు..డ్రైనేజ్ ల నిర్మాణం.. తాగునీటి సరఫరా సమస్యల్ని పరిష్కరించండి

ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థికసంఘం రెండో విడత నిధులు రూ.1.90కోట్లతో కౌన్సిలర్లు తమవార్డుల్లో ప్రజలకు అత్యవసరమైన పనుల్ని పూర్తిచేయాలన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మంజూరైన బీ.పీ.ఎస్ & ఎల్. ఆర్.ఎస్ గ్రాంట్ రూ.3.50కోట్లతో సీసీ రోడ్లు..డ్రైన్ల నిర్మాణంతో పాటు తాగునీటి సరఫరా, ఇతర అభివృద్ధిపనులు చేపట్టాలని, అందుకు అవసరమైన ప్రణాళికను అధికారులు సిద్ధం చేయాలని ప్రత్తిపాటి ఆదేశించారు.

ఆక్రమణలు తొలగింపుపై వెంటనే దృష్టిపెట్టండి..

పట్టణంలోని ఆక్రమణలపై వెంటనే దృష్టిపెట్టాలని.. రోడ్ల విస్తరణకు ఉన్న అడ్డంకుల్ని తొలగించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని ప్రత్తిపాటి అధికారుల్ని ఆదేశించారు. నరసరావుపేట రోడ్డు నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వరకు, చెక్ పోస్ట్ నుంచి కళామందిర్ కూడలివరకు .. బెంగుళూరు బేకరీ నుంచి నరసరావుపేట అమృత్ దాబా వరకు ఉన్న ఆక్రమణల్ని వెంటనే తొలగించి, రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలని ప్రత్తిపాటి అధికారుల్ని ఆదేశించారు. తాగునీటి బోర్లు వేయాలన్న ప్రజల విజ్ఞప్తుల్ని పరిశీలించాలని, దాతలు… ఆసిస్ట్ వంటి స్వచ్ఛంద సంస్థల్ని సంప్రదించి బోర్లు వేయించాలన్నారు. పట్టణంలో నిరుపయోగంగా ఉన్న బావుల్ని వెంటనే శుభ్రపరచాలని, నీటిని శుభ్రంగా తోడేసి మరలా వాటిలో చెత్తవేయకుండా ఇనుప కంచెలతో మూసివేయాలని ప్రత్తిపాటి సూచించారు. సమీక్ష సమావేశంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి బాబు, డిఇ అబ్దుల్ రహీమ్, మున్సిపల్ కౌన్సిలర్ లు, మున్సిపల్ సిబ్బంది, నాయకులు తదితరులున్నారు.

Share.
Leave A Reply