ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవాలి
పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి
రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిరసన
చిలకలూరిపేట:అన్ని విధాలుగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవాలని రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు డిమాండ్ చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదెండ్ల, తుబాడులో ఇరువురు రైతులు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఈ ఘటనకు నిరసనగా సీపీఐ,సీపీఎం, కాంగ్రెస్, ఇతర ప్రజా సంఘాలతో కూడిన రైతు సంఘాల సమన్వయకమిటి ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని ఎన్ఆర్‌టీ సెంటర్ వద్ద ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పలువురు రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించటంలో విఫలమైందన్నారు. నకిలీ, కల్తీ విత్తనాలు, ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, పెట్రో ధరాఘాతం, ప్రభుత్వ నిరాదరణ.. ఈ అవాంతరాలన్నీ దాటుకొని పంట సాగు చేస్తే వాటికి సైతం గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు పూర్తి స్టాయిలో నష్టపోతున్నారన్నారు. పత్తి,మిర్చి, పొగాకు, మామిడి, బొబ్బాయి ఇలా ప్రతి పంటకు కూడా సరైన ధరలు లేక రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు.
గత ఏడాది నల్లబర్లీ పొగాకు పంటకు ధర ఉందని, ఈ ఏడాది వేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తే కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేక రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. కంపెనీల నుంచి పొగాకు నిల్వలు కొనుగోలు చేయిస్తామని చెప్పినా కంపెనీలు ముందుకు రాలేదన్నారు. మార్కెఫెడ్ నుంచి కొనుగోలు చేయిస్తామని చెప్పినా కొనుగోలు చేయటంలో అలసత్వం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారని వెల్లడించారు. అన్ని రకాలగా నష్టపోయిన రైతులు భరోసా కోల్పయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం రైతాంగంలో ఆత్మస్థైర్యం నింపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత ఖరీప్ సీజన్‌లో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉంచాలని, ప్రైవేటు వడ్డీవ్యాపారులను ఆశ్రయించకుండా బ్యాంకులు రైతులకు పంట రుణాలు అందజేయాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కార్యక్రమానికి సీపీఎం నాయకులు పేరుబోయిన వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి బాబురావు, కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఎం రాధాకృష్ణ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సుభాని, మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, లోక్‌సత్తా రాష్ట్ర నాయకులు మాదాసు భానుప్రసాద్, జనక్రాంతి పార్టీ అధ్యక్షుడు షేక్ గౌస్, ప్రజా సంఘాల నాయకులు బి శ్రీనునాయక్, అడపా మోహన్ తదితరులు పాల్గొన్నారు