తల్లికి వందనంపై వైకాపా విమర్శలు దివాళా కోరుతనానికి నిదర్శనం: జీవీ
తల్లికివందనంపై వైకాపా విమర్శలు వారి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. ఒకే రోజు 67.27 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10,091 కోట్లు జమ చేయడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అన్న జీవీ ఇంత పెద్ద ఎత్తున, ఇంత పారదర్శకంగా సంక్షేమ పథకంపై వైకాపా, జగన్ విమర్శలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయన్నారు. శనివారం ఈ మేరకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో విపక్షంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారాయన. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే హామీల్లో 80% అమలు చేసి, ప్రజలకు నమ్మకం కల్పించిన ఘనత సాధించిందన్నా రు. మరీ ముఖ్యంగా సూపర్‌సిక్స్ హామీల్లో తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు గౌరవం, విద్యావ్యవస్థకు బలం, సామాజిక సంక్షేమానికి పట్టం కట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. నిజానికి తల్లికి వందనం పథకం అర్హత ప్రమాణాలు గతంలో వైకాపా ప్రభుత్వం నిర్దేశించినవే అన్న జీవీ కూటమి ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా పెంచి, అర్హులైన ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకం ప్రయోజనం అందేలా చేసిందన్నారు. అందుకే తల్లికివందనం పథకం మార్గదర్శకాల విషయంలో అద్దం ముందు నిలబడి రాళ్లు విసిరినా, పగిలేది వైకాపా మొహమే అని వారు గుర్తించాలని హితవు పలికారు. వారి అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే జగన్, వైకాపా నాయకులు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తన్నారని తూర్పారబట్టారు జీవీ. అయిదేళ్లపాలనలో సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిజాయితీగా, పారదర్శకంగా అమలు చేస్తున్న పథకాలు చూసి ఓర్వలేక, అసూయ తో రగిలిపోతున్నారన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి, నిరుద్యోగాన్ని పెంచి, రాష్ట్రాన్ని రూ.10 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత వారిదని కానీ కూటమి ప్రభుత్వం ఆ అప్పుల భారాన్ని మోస్తూనే, సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తోందన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థి తల్లికి రూ.15,000 సహాయం అందిస్తూ, విద్యను ప్రోత్సహిస్తూ, స్త్రీ శక్తిని గౌరవిస్తోందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో నే రాజకీయంగా ప్రజలకు దూరమై, అధికారం కోల్పోయిన అక్కసుతో వైకాపా ఉలికిపాటుకు గురవుతోందన్న జీవీ వారి తప్పుడు ప్రచారాలు, అసత్య ఆరోపణలు ప్రజలను మభ్యపెట్టలేవని స్పష్టం చేశారు. ఇకనైనా వైకాపా నాయకులు వారి వైఫల్యాలు గుర్తించి, ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని గౌరవించాలని సూచించారు. లేకపోతే, ప్రజలు వైకాపా, జగన్‌కు పూర్తిస్థాయిలో దూరం అవుతారనడంలో సందేహం లేదన్నారు.