చారిత్రక కొండవీడులో యోగా మహోత్సవం
యడ్లపాడు మండలంలోని చారిత్రక కొండవీడుకోటలో బుధవారం యోగాంధ్ర కార్యక్రమం అధికారులు నిర్వహించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (జూన్ 21) పురస్కరించుకుని శారీరక, మానసిక ఆరోగ్యానికి దివ్య ఔషధమైన యోగా ప్రాధాన్యత క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికీ తెలిసేలా జిల్లా అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రచించారు. రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర – 2025 పేరుతో చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా మే 21 నుంచి జూన్ 21 వరకు నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని 100 ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో, చారిత్రక ప్రాంతాల్లో యోగా ప్రచారాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వం, ప్రజల్లో ఆరోగ్య స్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా అధికారులు పిల్లల నుంచి వద్ధుల వరకు అవగాహన కల్పిçస్తూ..జిల్లా వ్యాప్తంగా యోగాపై వివిధ రకాల పోటీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలో మంగళవారం ప్రతిమండలానికి ముగ్గురు చొప్పున విద్యార్థులకు జిల్లాస్థాయిలో యోగాసాధనపై పోటీలు జరిగాయి. తాజాగా పల్నాడు జిల్లాలోని చారిత్రక కొండవీడుకోట వేదికగా బుధవారం ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటికే కోటప్పకొండ, నాగార్జునసాగర్‌లలో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించగా, తాజాగా కొండవీడుకోట ఘాట్‌రోడ్డు ప్రారంభంలోని చెక్‌పోస్టు వద్ద ఉదయం 6 గంటల నుంచి గంటన్నరపాటు యోగా ప్రదర్శన జరుగనుంది. ఈ కార్యక్రమంలో ఆయుష్ శాఖతో పాటు టూరిజం, అటవీ, వైద్యారోగ్య, పంచాయతీరాజ్, రెవెన్యూ, ఐసీడీఎస్ వంటి వివిధ శాఖల అధికారులు పాల్గొననున్నారు. యోగాభ్యాసం ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాలపై వారు ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. అనంతరం ప్రాథమిక యోగాసనాల ప్రదర్శన చేపడతారు. పల్నాడు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో టూరిజం, అటవీశాఖల పర్యవేక్షణలో పలుశాఖల సమన్వయంతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి అరుణ్‌బాబు, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకష్ణదేవరాయులు, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, డ్వాక్రా సంఘాల మహిళలు, యువత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. దీంతో ఘాట్‌రోడ్డు ప్రాంతంలో యోగాభ్యాసానికి వేదిక, కార్యక్రమానికి వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను శుభ్రం చేయించి సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఆహ్లాద వాతావరణంలో ప్రజల్లో ఆరోగ్యచేతన పెంపొందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వేలాదిమంది ప్రజలను ఈ కార్యక్రమానికి సమీకరించ నున్నారు. జిల్లాలో చివరిగా ఈనెల 18వ తేదీన అమరావతిలోని జ్ఞానబుద్ధ ప్రాంతంలో నిర్వహించనున్నారు