సేవలో విద్యకే తొలిప్రాధాన్యత

ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ చిలకలూరిపేట అధ్యక్షురాలు గట్టు సరోజిని

రవిశంకర్‌ ఆశ్రమ పాఠశాల అభివృద్ధికి రూ.10.20 లక్షల చెక్కు అందజేత

యడ్లపాడు అనాథ బాలల విద్యాభ్యున్నతికి ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ భారీ విరాళాన్ని అందించింది. యడ్లపాడు మండలం కొత్తపాలెం(పుట్టకోట) గ్రామంలో ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ ఆఫ్‌ చిలకలూరిపేట ఆధ్వర్యంలో ఆధ్మాత్మిక గురూజీ రవిశంకర్‌ ఆశ్రమ పాఠశాల(ఆర్ట్‌ ఆఫ్‌ లింగ్‌)కు రూ.10.20 చెక్కును శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ ఆఫ్‌ చిలకలూరిపేట అధ్యక్షురాలు గట్టు సరోజిని మాట్లాడుతూ క్లబ్‌ ఆధ్వర్యంలో చేపట్టే సేవా కార్యక్రమాల్లో పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉచిత విద్య, సౌకర్యాలను అందించడంలో ఇన్నర్‌వీల్‌ తొలిప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇందులో భాగంగానే మద్ది లక్ష్యయ్య గ్రూప్స్‌ కంపెనీ డైరెక్టర్‌ మద్ది వెంకటేశ్వరరావు, లలితమ్మ దంపతుల ఆర్ధిక సహకారంతో ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ ఆఫ్‌ చిలకలూరిపేట ఆధ్వర్యంలో రూ.10.20 లక్షల విరాళాన్ని అందజేసినట్లు తెలిపారు. ఈ నిధులతో ఆశ్రమ పాఠశాలలో మూడు బ్లాక్‌ల్లో మరుగుదొడ్ల నిర్మాణం, పుస్తకాలు, తాగునీటి సౌకర్యాలు ఇతరేత్ర వాటిని సమకూర్చనున్నట్లు వెల్లడించారు. క్లబ్‌ డిస్ట్రిక్‌ చైర్మన్‌ ప్రేమలత మాట్లాడుతూ ఆధ్మాత్మిక గురూజీ రవిశంకర్‌ ఆధ్వర్యంలో కొండవీడు కొండల నడుమ పచ్చని ప్రకృతితో అనాధ విద్యార్థుల కోసం ఆశ్రమ పాఠశాల నిర్వహించడం పేద కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇక్కడ 180 మంది పిల్లలకు మానవత విలువలతో ఉచిత విద్యను అందిస్తున్నారన్నారు. ఇన్నర్‌వీల్‌ చిలకలూరిపేట శాఖ ఇంతటి భారీ విరాళాన్ని సేకరించి అందించడం అభినందనీయం అన్నారు. పాఠశాలలో మౌళిక సదుపాయాల కల్పనకు భారీ విరాళాన్ని అందించిన క్లబ్‌ సభ్యుల్ని హెచ్‌ఎం కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షులు గట్టు సరోజిని, దాత మద్ది లలిత, డాక్టర్‌ గట్టు రంగారావు, ఏసీ చైర్మన్‌ సభ్యులు కోలా విజయలక్ష్మీ, కార్యదర్శి నార్నె జయలక్ష్మి, పాస్ట్‌ ప్రెసిడెంట్‌ టి రమాదేవి, సభ్యులు జాస్తి ప్రమీలా, కె భారతి, ఎం పద్మావతి, జి రత్న, ఆశ్రమ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply