గోతుల మ‌యంగా మారిన పేట రోడ్లు
ప్ర‌మాదాల‌కు కార‌ణ‌మౌతున్న గోతులు
కౌన్సిల‌ర్లు రోడ్ల దుస్థితిపై గ‌ళ‌మెత్తాలి
మాజీ మున్సిప‌ల్ కౌన్సిల్ ప్ర‌తిప‌క్ష‌నాయ‌కుడు షేక్ జ‌మాల్ బాష

చిల‌క‌లూరిపేట‌:చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణం గోతుల మ‌యంగా మారి, ప్ర‌జ‌ల ఇబ్బందుల‌కు కార‌ణ‌మౌతుంద‌ని టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మున్సిప‌ల్ కౌన్సిల్ ప్ర‌తిప‌క్ష‌నాయ‌కుడు షేక్ జ‌మాల్ బాష విమ‌ర్శించారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు అధికారంలోకి రాగానే ప‌ట్ట‌ణ ప‌రిధిలో ఉన్న రోడ్ల దుస్థితిపై దృష్టి సారించార‌ని, ప‌లు మార్లు స‌మీక్ష స‌మావేశాల్లో సైతం ప‌ట్ట‌ణ అభివృద్దిపై చ‌ర్చించార‌ని గుర్తు చేశారు. కాని ఏడాది గ‌డుస్తున్నా మున్సిప‌ల్ అధికారులు ప‌ట్ట‌ణంలోని రోడ్ల దుస్థితిపై దృష్టి సారించ‌క‌పోవ‌డం విచార క‌ర‌మ‌న్నారు. కొంత మంది ఎటువంటి అనుమ‌తులు లేకుండానే మున్సిప‌ల్ కుళాయిల మ‌ర‌మ‌త్తుల కోసం గోతులు తీసి వ‌ద‌లివేస్తున్నార‌ని, వివిధ కార‌ణాల‌తో అండ‌ర్ కేబుల్ వ్య‌వ‌స్థ కోసం ప్రైవేటు సంస్థ‌లు రోడ్ల‌ను ద్వంసం చేసి, అనంత‌రం వాటిని పూడ్చ‌క పోవ‌డంతో ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయ‌ని ఆరోపించారు. రోడ్ల మ‌ర‌మ‌త్తుల మాట దేవుడెరుగు.. రోడ్ల‌ను ద్వంసం చేస్తున్నా మున్సిప‌ల్ అధికారులు ప‌ట్టించుకోక‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు. రోడ్ల‌ను మ‌ర‌మ‌త్తులు చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల వాహ‌న‌దారులు, పాదాచారులు గోతుల్లో ప‌డి ప్ర‌మాదాల‌కు గురి అవుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుత వార్షాకాలంలో గోతుల్లో నీరు చేరితే, ఎక్క‌డ రోడ్డు ఉండో.. ఎక్క‌డ గోతులు ఉన్నాయో తెలియ‌క ప్ర‌మాదాలు సంబవించే అవ‌కాశం ఉంద‌న్నారు. మున్సిప‌ల్ అధికారులు ఏ ప‌నిచేసినా, ఏ సంస్క‌ర‌ణ చేప‌ట్టినా అది మూనాళ్ల ముచ్చ‌టగా మారుతుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్లాస్టిక్ నిషేదం, రోడ్ల విస్త‌ర‌ణ అంటూ హ‌డావిడి చేసిన అధికారులు, అనంత‌రం దాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డం స‌రికాద‌న్నారు. కౌన్సిల్ స‌మావేశాల్లో కౌన్సిల‌ర్లు రోడ్ల దుస్థితిపై చ‌ర్చించి, గోతుల‌ను యుద్ద ప్రాతిప‌దిక‌గా పూడ్చ‌టానికి అధికారుల‌పై ఒత్త‌డి తీసుకురావాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ఎత్తి చూపే మీడియా కూడా ఈ విష‌యంలో నిర్లిప్తంగా ఉండ‌టం స‌రికాద‌న్నారు.

Share.
Leave A Reply