చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని వేంకటేశ్వరుని వేడుకున్నాను : మాజీమంత్రి ప్రత్తిపాటి
- అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపే శక్తిని స్వామివారు చంద్రబాబుకు ప్రసాదించాలి : ప్రత్తిపాటి.
- దర్శనానంతరం టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడితో మర్యాదపూర్వకంగా భేటీఅయిన ప్రత్తిపాటి

“రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న చంద్రబాబునాయుడి ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని, ఆయన నాయకత్వంలోని కూటమిప్రభుత్వంలో నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని కలియుగదైవం వేంకటేశ్వరుని వేడుకున్నట్టు మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మహానాడు చివరిరోజైన గురువారం ఉదయం ప్రత్తిపాటి తిరుమల శ్రీవారిని దర్శించుకొని, స్వామివారి సేవల్లో పాల్గొన్నారు. దర్శనానంతరం తిరుమల మాడవీధుల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమిప్రభుత్వంలో రాష్ట్రం దినదినాభివృద్ధి చెంది, దేశానికే గర్వకారణంగా నిలవాలని, ఆ దిశగా ఏపీ పురోగతిసాధనకు అవసరమైన శక్తియుక్తుల్ని ముఖ్యమంత్రికి ప్రసాదించాలని స్వామివారిని వేడుకున్నట్టు ప్రత్తిపాటి తెలిపారు. స్వామివారి అనుగ్రహంతోనే పార్టీ పండుగైన మహానాడు అనుకున్నదానికంటే ఎక్కువగా విజయవంతం అయిందని ప్రత్తిపాటి చెప్పారు. మహానాడులో తీర్మానాలన్నీ దిగ్విజయంగా అమలై లోకేశ్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తిరుగులేని విధంగా ఎదగాలని స్వామిని ప్రార్థించినట్టు ఆయన చెప్పారు. అలానే రైతులకు ఈ సంవత్సరం మంచిజరిగేలా చూడాలని, వారి జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరిసేలా చూడాలని ఆ ఏడుకొండలవాడిని వేడుకున్నట్టు మాజీమంత్రి తెలియచేశారు. మీడియాతో మాట్లాడిన అనంతరం ప్రత్తిపాటి టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడితో ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. టీటీడీలో చేపట్టిన సంస్కరణలు, భక్తులకు అందిస్తున్న సేవలు బాగున్నాయన్న ప్రత్తిపాటి బీ.ఆర్.నాయుడిని ప్రత్యేకంగా అభినందించారు. ఆలయ అధికారులు సమన్వయంతో పనిచేసి తిరుమల ప్రతిష్ఠను మరింత పెంచాలని ప్రత్తిపాటి సూచించారు. ప్రత్తిపాటి జన్మదినమని తెలుసుకొన్న బీ.ఆర్.నాయుడు మాజీమంత్రిని ప్రత్యేకంగా సన్మానించి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు.. తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లిన ప్రత్తిపాటి వెంట కందుల రమణ, గంగా శ్రీనివాసరావు, గట్టినేని రమేష్, సాంబశివరావు తదితరులున్నారు.



