తెలుగువారి ఆరాధ్యదైవం, తెలుగునేల తరగని ఆస్తి ఎన్టీఆర్ : మాజీమంత్రి ప్రత్తిపాటి
- తెలుగుజాతి ఆత్మగౌరవ చిహ్నం.. ఆత్మస్థైర్య ప్రతీక ఎన్టీఆర్
- ధరిత్రి మెచ్చిన ధృవతార ఎన్టీఆర్
“తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మహానాయకుడు, మహానుభావుడు, కారణజన్ముడు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారు. తెలుగువారి ఆరాధ్యదైవం.. తెలుగునేలకు ఎన్నటికీ, ఎప్పటికీ తరగని ఆస్తి ఎన్టీఆర్. 1923 మే 28న కృష్ణాజిల్లా పామర్రు మండలం నిమ్మకూరులో జన్మించిన ఎన్టీఆర్ కృషి, పట్టుదల, మొండితనం, మొక్కవోని సంకల్పంతో అంచెలంచెలుగా ఎదిగి, సినీ.. రాజకీయ రంగాల్లో మకుటం లేని మహారాజుగా వెలుగొందారు. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రజల్లోకి వచ్చిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దశ, దిశ మార్చింది. 1983 జనవరి 9న రాష్ట్రంలో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా స్వర్గీయ ఎన్టీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయన పాలన తెలుగుప్రజలకు స్వర్ణయుగమనే చెప్పాలి.



