గురజాల డీఎస్పీగా జగదీశ్
గురజాల డిఎస్పీ గా జగదీశ్ శనివారం రాత్రి మళ్లీ బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆదివారం సివిల్స్ పరీక్షకు హాజరయ్యేందుకు విజయవాడ వెళ్లారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో పనిచేస్తారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 10న డీఎస్పీగా ఉన్న జగదీశ్ ని రాజకీయ కారణాలతో డీఐజీకి ఎటాచ్ చేస్తూ అనధికార ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఆ రోజు నుంచి గురజాల డీఎస్పీ పోస్టు ఖాళీగా ఉంది. సత్తెనపల్లి డీఎస్పీ ఇన్ఛార్జిగా భాద్యతలు తీసుకున్నారు. పల్నాడులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, గుండ్లపాడు జంట హత్యలు, రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంగా ఉండటం, డీఎస్పీ పోస్టు కీలకంగా ఉన్న నేపథ్యంలో ఖాళీగా ఉంచడం పద్ధతి కాదని గుర్తించిన పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒకసారి డీజీపీకి ఎటాచ్ అయిన అధికారికి తిరిగి అక్కడే పోస్టింగ్ ఇవ్వడం అరుదు. దాచేపల్లి, మాచవరం మండలాల పరిధిలోని రెండు కేసుల్లో అధికార పార్టీకి సరైన రీతిలో సహకరించ లేదని ఆయను డీఐజీకి ఎటాచ్ చేశారు. గ్రూప్- 1 అధికారిగా ఉన్న జగదీశ్ ని ఇలా ఎటాచ్ చేయడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నెలన్నరలో కొత్తగా డీఎస్పీగా ఎవరినీ నియమించకుండా మళ్లీ ఆయనకే పోస్టింగ్ ఇచ్చారు.



