జగన్ ఉనికి రాష్ట్రప్రగతి… ప్రజల మనుగడకే ప్రమాదం : మాజీమంత్రి ప్రత్తిపాటి

  • జగన్ రాక్షసపాలనకు విసిగిపోయే ప్రజలు కూటమిపార్టీలను భారీ మెజారిటీతో గెలిపించారు.
  • చంద్రబాబు ఆలోచనలు.. అనుభవమే రాష్ట్రానికి పెద్ద ఆస్తి
  • మహానాడు విజయవంతంపై రాజంపేట టీడీపీ శ్రేణులకు ప్రత్తిపాటి దిశానిర్దేశం
  • కడపలో జరిగే తొలి మహానాడు చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయాలి.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కడపలో జరుగుతున్న తొలి మహానాడుని కనీవినీ ఎరుగని విధంగా దిగ్విజయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీమంత్రి, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
మహానాడు జనసమీకరణ కమిటీ సభ్యుడిగా తనకు అప్పగించిన బాధ్యతల్లో భాగంగా రాజంపేటలో పర్యటించిన ప్రత్తిపాటి, స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడారు.

ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన స్వర్గీయ ఎన్టీఆర్, ప్రజలు మెచ్చేలా ఎన్నో గొప్ప సంక్షేమ పథకాలతో దేశం గర్వించేలా పార్టీని నడిపారని పుల్లారావు చెప్పారు. ఆ మహానుభావుడి ఘనతను, చరితను స్మరించుకుంటూ ఏటా తెలుగుదేశం శ్రేణులు ఘనంగా నిర్వహించుకునే గొప్ప పండుగ మహానాడు అని ప్రత్తిపాటి చెప్పారు. స్వర్గీయ ఎన్టీఆర్ బాటలో పార్టీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు అనతికాలంలోనే తన పనితీరు, పాలనాసంస్కరణలతో ప్రజల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారని ప్రత్తిపాటి తెలిపారు. నీతి అయోగ్ సదస్సులో మన నాయకుడు ఇచ్చిన ప్రజంటేషన్ ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు సహా ఎందరినో విశేషంగా ఆకట్టుకుందున్నారు. చంద్రబాబునాయుడి ఆలోచనలు… నాయకత్వమే మనరాష్ట్రానికి పెద్ద ఆస్తి అని ప్రత్తిపాటి చెప్పారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనల్లో రాష్టాభివృద్ధి, ప్రజల శ్రేయస్సుకు సంబంధించిన నిర్ణయాలుంటే, జగన్ చేసిన పర్యటనల్లో స్వప్రయోజనాలు… కేసులమాఫీ వ్యవహారాలుండేవని ప్రత్తిపాటి అబిప్రాయపడ్డా రు.

ప్రభుత్వం.. పార్టీలో లోకేశ్ ది చెరగని ముద్ర..
చంద్రబాబునాయుడి దార్శనికత, స్వర్గీయ ఎన్టీఆర్ పట్టుదలతో యువనాయకుడు నారా లోకేశ్ అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో తనదైన శైలిలో దూసుకుపోతూ చెరగని ముద్ర వేస్తున్నారని ప్రత్తిపాటి కొనియాడారు. యువగళం పాదయాత్ర ద్వారా తెలుగుదేశానికి భవిష్యత్ దిక్సూచిగా లోకేశ్ నిలిచారన్నారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చడంతోపాటు, పార్టీకార్యకర్తలకు అండగా నిలుస్తూ వారి రక్షణబాధ్యతల్ని లోకేశ్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక ఏనాడూ రానంత భారీమెజారిటీ కొన్ని నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీడీపీకి వచ్చిందని ప్రత్తిపాటి చెప్పారు. అలాంటి నియోజకవర్గాల్లో చిలకలూరిపేట ఒకటన్న ప్రత్తిపాటి, మంగళగిరిలో లోకేశ్ భారీ మెజారిటీ సాధించి, తన శక్తిసామర్థ్యాలు నిరూపించుకున్నాడన్నారు. రాబోయే 40 ఏళ్లపాటు తెలుగుదేశం పార్టీని ప్రజలు మెచ్చేలా నడిపించడం కోసం లోకేశ్ ఎంతో దూరదృష్టితో పనిచేస్తున్నాడన్నారు. నాయకులు, కార్యకర్తలకు ఎనలేని నమ్మకం, భరోసా కల్పించి పార్టీ కార్యకలాపాల్లో లోకేశ్ తనదైన ముద్రవేస్తున్నారని ప్రత్తిపాటి తెలియచేశారు.

జగన్ రాక్షస పాలన వల్లే కూటమిపార్టీలకు భారీ మెజారిటీ…

కూటమిపార్టీలకు ఇంత భారీ మెజారిటీ రావడానికి జగన్మోహన్ రెడ్డి అహంకారపూరిత చర్యలు, రాక్షసపాలనే కారణమని ప్రత్తిపాటి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనపై ప్రజల్లో గూడుకట్టుకున్న వ్యతిరేకత కూడా కూటమిపార్టీల విజయానికి ఒక ప్రధాన కారణమన్నారు. జగన్ పరిపాలన మొత్తం అక్రమ అరెస్టులు.. తప్పుడు కేసులు… కక్షసాధింపులు.. వేధింపు లు.. అవినీతి తప్ప మరోటి లేదని ప్రత్తిపాటి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత ఎన్నడూ, ఎవరూ చూడని దుర్మార్గపు రాజకీయాలు జగన్ చేశాడన్నారు. ప్రజల్ని కుల, మత.. ప్రాంతాలవారీగా విడగొట్టి తన పబ్బం గడుపుకున్నాడని ప్రత్తిపాటి చెప్పారు.
జగన్ ఉనికి రాష్ట్రప్రగతి..ప్రజల శ్రేయస్సుకే ప్రమాదం..

2029 ఎన్నికల నాటికి జగన్ జైలుకెళ్లడం ఖాయమని, అలాంటి వ్యక్తి బయట ఉంటే రాష్ట్ర ఉనికి, ప్రజల శ్రేయస్సుకే ప్రమాదమని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. జగన్ చేసిన నేరాలకు, ఆయనకు గాలి జనార్థన్ రెడ్డికంటే ఎక్కువ శిక్ష పడుతుందన్నారు. ఒకే ప్రభుత్వం సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం వల్ల రాష్ట్రం కనీవినీ ఎరుగని రీతిలో వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. సూపర్-6 పథకాలు అమలైతే ప్రజలు వైసీపీని పూర్తిగా మర్చిపోతారని, దాంతో ఆ పార్టీయే కనుమరుగ వుతుందని ప్రత్తిపాటి తెలిపారు. రాజంపేట ఇన్ ఛార్జ్ జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి మహానాడుని రాష్ట్రం గర్వించేలా విజయవంతం చేయాలని ప్రత్తిపాటి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల రమణ, టీడీపీ నాయకులు గంగా శ్రీనివాసరావు, గట్టినేని రమేష్, పిల్లి కోటి తదితరులున్నారు.

Share.
Leave A Reply