చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి దేశ స్థాయిలో రైతు నాయకుడిగా ఎదిగిన సోమేపల్లి సాంబయ్య మనల్ని వదిలి వెళ్లి సంవత్సరాలు గడుస్తున్నా నేటికి ఆయన పేట ప్రజల హృదయాల్లో చిరంజీవిగా ఉన్నారు. సోమపల్లి సాంబయ్యకు నివాళులు అర్పిస్తూ …
చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్దిలోనూ, రాజకీయాల్లోనూ మాజీ ఎమ్మెల్యే సోమేపల్లి సాంబయ్య ది వినూత్న శైలీ. స్వచ్చమైన, నీతి వంతమైన రాజకీయాలకు ఆయన పెట్టింది పేరు. రాజకీయాలంటే ప్రజల సేవ కోసమని నమ్మిన సోమేపల్లి తన జీవిత చరమాంకం వరకు ప్రజల సేవలోనే గడిపారు. విద్యావంతుడు రాజకీయనాయకుడైతే ప్రజల జీవితాల్లో ఏ విధంగా మార్పు వస్తుందన్న విషయానికి ప్రత్యేక నిదర్శనం సాంబయ్యగా చెప్పవచ్చు. ప్రజల సేవ కోసం అలనాడే గుంటూరు ఏసీ కళాశాలలో అద్యాపకుని ఉద్యోగాన్ని సైతం వదులుకొని రైతు నాయకుడిగా ఎదిగిన సోమేపల్లి వర్ధంతి నేడు
ప్రజల కోసం నిలబడ్డ నాయకుడ్ని ప్రజలు అక్కున చేర్చుకుంటారని, ఆ నాయకుడి కోసం చివరి వరకు నిలబడతారనటానికి సాంబయ్య జీవితమే నిదర్శనం. రైతు బిడ్డగా రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా వారి కోసం ఏదో చేయాలని పరితపించేవారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారి సోమేపల్లి సారధ్యంలో సాగునీటి కోసం ఎత్తి పోతల పథకాలకు చిలకలూరిపేటటో అంకురార్పణ జరిగిందంటే ఇది ఒక్క రోజులో సాధ్యమైన విషయం కాదు. రైతుల సంక్షేమం కోసమే కాదు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఆయన పాటుపడ్డారు. నియోజకవర్గంలో ఏర్పాటైన అనేక కాలనీలకు అలనాడు సోమేపల్లి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్నవే. వారికి పట్టాలు ఇప్పించటమే కాకుండా ఇళ్ల నిర్మాణం సైతం గావించారు.ఆయన చేసిన అభివృద్ది, కార్యక్రమాలు చెప్పుకోవాలంటే ఈ కాలమ్ సరిపోదు.