లిక్కర్ స్కామ్ లో జగన్ జైలుకెళ్లడం ఖాయం : మాజీమంత్రి ప్రత్తిపాటి

  • రాష్ట్రం బాగుండాలనుకునేవారంతా జగన్ జైలుకెళ్లాలనే కోరుకుంటున్నారు.
  • ఆయన జైలుకు వెళితే రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తాయి
  • కూటమిపార్టీల శ్రేణులు బేధాభిప్రాయాలను పక్కనపెట్టి ఐక్యంగా పనిచేయాలి.
  • 15 ఏళ్లు అధికారంలో ఉండాలన్న లక్ష్యం తప్ప, ఎవరూ ఎలాంటి అభిప్రాయబేధాలకు తావు ఇవ్వకండి.
  • చిలకలూరిపేట మినీమహానాడులో మాజీమంత్రి, శాసనసభ్యుల ప్రత్తిపాటి.
  • టీడీపీకి ప్రజలే అధికార, ప్రతిపక్షాలు : ఎంపీ లావు కృష్ణదేవరాయలు
  • ఒక కార్యకర్తగా పల్నాడు జిల్లా అభివృద్ధిపై సంతోషిస్తున్నా : కొమ్మాలపాటి శ్రీధర్
  • మరలా అధికారంలోకి వస్తానని జగన్ కలలుగంటున్నాడు : చదలవాడ అరవిందబాబు

చిలకలూరిపేటలో గత ఎన్నికల్లో అవినీతికి పాల్పడిన మాజీమంత్రి పోటీ చేసి ఉంటే టీడీపీకి లక్షల్లో మెజారిటీ వచ్చేదని, స్వాతంత్ర్యం వచ్చాక ఎన్నడూ రానంత భారీ మెజారిటీతో 2024 ఎన్నికల్లో తనను గెలిపించారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మంగళవారం సాయంత్రం పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్ లో జరిగిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో పాల్గొన్న ఎంపీ లావు కృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు తో కలిసి మొదట తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రత్తిపాటి కీలక ప్రసంగం చేశారు.

గత ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే మాజీమంత్రి తెలివిగా చిలకలూరిపేటలో పోటీచేయకుండా తప్పుకొని గుంటూరుకు చెక్కేసిందని ప్రత్తిపాటి చెప్పారు. ప్రతి కార్యకర్తను సంతోషపరిచేలా అందరికీ న్యాయం చేయాలన్న సదుద్దేశంతోనే తాను పనిచేస్తున్నానని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. కూటమిపార్టీల్లోని ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరిచేలా పనిచేయడమే తన లక్ష్యమన్నా రు. 5ఏళ్ల పాటు భయభ్రాంతులతో బతికిన కూటమిపార్టీల కార్యకర్తలు, నాయకులు అందరూ బేధాభిప్రాయాలను పక్కనపెట్టి పనిచేయాలని ప్రత్తిపాటి సూచించారు. పాతతరం ఆలోచనలు విడనాడి కాలానుగుణంగా అందరూ మైండ్ సెట్ మార్చుకోవాలన్నారు. ముఖ్యంగా గ్రామాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అందరూ కలిసి నడవాలన్నారు. ఇతరపార్టీల్లోని వారు అధికార పార్టీల్లో చేరతామన్నా, భేషజాలు లేకుండా వారిని కలుపుకోవాలన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిపార్టీలే విజయం సాధించాలి

తాను ఇదివరకటిలా మెతకవైఖరి అవలంబించకుండా అధికారంలో ఉన్న మూడు పార్టీల కోసం అందరినీ కలుపుకొని ముందుకు పోతున్నానని ప్రత్తిపాటి తెలిపారు. భవిష్యత్ లో జరగ బోయే స్థానిక సంస్థల ఎన్నికలలో చిలకలూరిపేట నియోజకవర్లంలో అన్నిస్థానాల్లో కూటమి పార్టీలే విజయం సాధించాలన్నారు. అందరం ఐక్యంగా ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదన్నా రు. చంద్రబాబు తన అనుభవంతో రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ఎంతో కష్టపడుతున్నారనే వాస్తవాన్ని అందరూ గుర్తించాలన్నారు. సామాజిక పింఛన్ రూ.4వేలు రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా ఇవ్వడం లేదన్నారు. కొత్త రేషన్ కార్డులతో పాటు మూడునెలల్లోనే సూపర్ 6 పథకాలన్నీ ప్రభుత్వం అమలుచేయనుందన్నారు. నియోజకవర్గంలో కూటమిపార్టీల శ్రేణులపై ఈగకూడా వాలనివ్వకుండా చూస్తానని, ఎవరికీ అంత ధైర్యం కూడా లేదనే వాస్తవాన్ని మూడుపార్టీల శ్రేణులు గ్రహించాలని ప్రత్తిపాటి సూచించారు.

రాష్ట్రం బాగుపడాలనుకునేవారు జగన్ జైలుకెళ్లాలని కోరుకుంటున్నారు

కూటమిపార్టీలు సమన్వయంతో, ఐకమత్యంగా ముందుకు వెళ్లాలని, అప్పుడే 15 ఏళ్లపాటు మూడుపార్టీలు అధికారంలో ఉంటాయని ప్రత్తిపాటి తెలిపారు. కూటమిప్రభుత్వం అధికారంలో జగన్ కుట్రలు, కుతంత్రాలు సాగవన్నారు. మద్యం కుంభకోణంలో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్న ప్రత్తిపాటి, రాష్ట్రం బాగుపడాలనుకునేవారంతా ఆయన జైల్లోనే ఉండాలని కోరుకుంటున్నారన్నారు. జగన్ జైలుకు వెళితే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం పెరుగుతుంద ని, తద్వారా పరిశ్రమలు ఏర్పాటవుతాయన్నారు.

బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తయితే చిలకలూరిపేట నియోజకవర్గానికి నీటిసమస్యే ఉండదు

కొండవీడు కోటను పర్యాటక, చారిత్రక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నానన్న ప్రత్తిపాటి, ఇటీవలే ఎంపీ కృష్ణదేవరాయలుతో కలిసి కేంద్ర పర్యాటక మంత్రిని కలిసి మాట్లాడటం జరిగిందన్నారు. అమృత్ పథకం కింద చిలకలూరిపేటకు నేరుగా నాగార్జన్ సాగర్ కెనాల్ నుంచి పైపులైన్లు వేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అది పూర్తయితే 50 ఏళ్లవరకు నియోజకవర్గంలో మంచినీటి సమస్యే ఉండదన్నారు. నదుల అనుసంధా నమనే గొప్ప ఆలోచన చంద్రబాబు తప్ప దేశంలో ఎవరూ చేయలేదన్న ప్రత్తిపాటి, బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తయితే చిలకలూరిపేటకు నీటిసమస్యే ఉండదన్నారు. గోదావరి నీటిని బనకచర్ల ద్వారా రాయలసీమకు తరలిస్తే రాష్ట్రమే సస్యశ్యామలం అవుతుందన్నారు. ఎంతకష్టపడితే చిలకలూరిపేటకు రూ.1000కోట్లతో బైపాస్ వచ్చిందో ప్రజలు ఆలోచించాలన్నారు. హైదరాబా ద్ నుంచి నేరుగా ఓడరేవుకు పోయేలా నిర్మించే నూతన రహదారి కూడా చిలకలూరిపేటకు బాగా ఉపయోగపడుతుందని ప్రత్తిపాటి తెలిపారు. నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీ ఆడబిడ్డల విద్య, సంక్షేమం దృష్ట్యా తీసుకొచ్చిన పథకాన్ని దుర్మార్గపు ప్రభుత్వం పక్కనపెట్టిందని, త్వరలోనే దాన్ని పున: ప్రారంభిస్తామని ప్రత్తిపాటి చెప్పారు. నియోజకవర్గం లోని అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లను బాగుచేసేందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నా మని, అన్నీ పూర్తయితే నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీరందుతుందన్నారు. నియోజక వర్గానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న అన్ని అభివృద్ధి పనుల్ని ఎంపీ సహాకారంతో పూర్తి చేస్తానని ప్రత్తిపాటి స్పష్టం చేశారు.

అవినీతి మంత్రి చేసిన తప్పులు, అరాచకాలకు మూల్యం చెల్లించుకోక తప్పదు

దోపిడీదారులు, దొంగలు, ముద్దాయిల్ని కారులో పెట్టుకొని పోలీసుల్ని అడ్డుకున్నవారిని ఏమనాలన్న ప్రత్తిపాటి, నియోజకవర్గంలో ఎన్నడూ ఎవరూ ఎరగనంత దోపిడీకి పాల్పడి భ్రష్టు పట్టించారని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తంచేశారు. అవినీతిమంత్రికి వత్తాసు పలికిన దొంగలు ఇప్పటికే ఆమెకు ముఖం చాటేశారన్నారు. అవినీతిమంత్రి చేసిన అన్ని తప్పులు, అరాచకాలు, అవినీతి చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. గతప్రభుత్వంలో వైద్యారోగ్యశాఖలో జరిగిన దోపిడీ వ్యవహారం కూడా త్వరలోనే బయటకు వస్తుందన్నారు. పార్టీల్లోని అనుబంధ విభాగాలను, కార్యకర్తలను ఎప్పటికీ విస్మరించబోమని, పార్టీ బలోపేతమే తన ఏకైక లక్ష్యమని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. 15 ఏళ్లు అధికారంలో ఉండటం కోసం ఎవరు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ గౌరవింపబడాలో వారికి వారే ఆలోచించుకోవాలన్నారు.

టీడీపీకి ప్రజలే ప్రతిపక్షం.. అధికారపక్షం : లావు శ్రీ కృష్ణదేవరాయలు (నరసరావుపేట ఎంపీ)

గత ఎన్నికల్లో కూటమిపార్టీలకు 92శాతం సక్సెస్ రేటు రావడం అనేది అన్నివర్గాల ప్రజల వల్లనే సాధ్యమైందని, అదే స్వర్గీయ ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అని నరసరావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు అన్నారు. టీడీపీకి గెలుపోటములు సహజమని, జనాలకు దగ్గరగా ఉండటమే పార్టీకి ముఖ్యమని, అధికారపక్షమైనా, ప్రతిపక్షమైనా అది ఎప్పుడూ ప్రజలేనని లావు స్పష్టంచేశారు. జనం గురించి ఆలోచిస్తూ, వారికోసం పనిచేసేవారికే భవిష్యత్ ఉంటుందన్నారు. తాము తప్పులు చేసినా ఎవరైనా నిర్భయంగా తెలియచేయవచ్చని, భవిష్యత్ లో జరిగే స్థానిక సంస్థల ఎన్ని కల్లో కూటమిపార్టీల గెలుపుకోసం అందరూ ఐకమత్యంగా పనిచేయాలన్నారు.

చిలకలూరిపేట డ్రైనేజ్ సమస్యను పరిష్కరిస్తాం… మున్సిపాలిటీ అవినీతిపై విజిలెన్స్ దర్యాప్తు జరిపించి అసలు దోషుల్ని శిక్షిస్తాం

చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించి ప్రవేశపెట్టిన తీర్మానాలను పరిగణనలోకి తీసుకుంటున్నామన్న లావు, వర్షపునీరు రోడ్లపైకి రాకుండా త్వరలోనే పట్టణంలోని డ్రైన్లను పూర్తిస్థాయిలో ఆధునికరించబోతున్నామన్నారు. మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ దర్యాప్తు జరిపించి అసలు దోషుల్ని శిక్షిస్తామని కృష్ణదేవరాయలు స్పష్టంచేశారు. పసుమర్రు, గణపవరం, మానుకొండవారి పాలెం పంచాయతీలను పేట మున్సిపాలిటీలో గత ప్రభుత్వం బలవంతంగా విలీనం చేసిందని, ఆ వ్యవహారం కోర్టులో నడుస్తోందని, ఆ వ్యవహారం ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. అలానే కొన్నిగ్రామాల్లోని పల్లెలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించాలనే వినతులు వచ్చాయని, వాటిపై మరలా ఆయా గ్రామాలు, గ్రామస్తులు నుంచి ప్రతిపాదనలు అందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు లభించే సబ్సిడీ రుణాలను చిలకలూరిపేట యువత సద్వినియోగం చేసుకోవాలని, త్వరలోనే బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటుచేస్తామని లావు తెలిపారు. గ్రామాల్లోని సొసైటీల అభివృద్ధిపై గ్రామస్తులు దృష్టిపెట్టాలని, నాబార్డ్ నిధులతో ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చిని, సొసైటీల సభ్యులు దానిపై దృష్టిపెట్టాలని ఎంపీ సూచించారు.

పల్నాడు జిల్లా అభివృద్ధిపై ఎంతో సంతోషిస్తున్నా : కొమ్మాలపాటి శ్రీధర్ (పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు)

చిలకలూరిపేట నియోజకవర్గస్థాయి మహానాడుకు టీడీపీ శ్రేణులు భారీసంఖ్యలో తరలిరావడం చూస్తే పార్టీకోసం ప్రాణమిచ్చే కార్యకర్తల ఉత్సాహం కనిపిస్తోందని పల్నాడు జిల్ల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందరు మారినా టీడీపీ చేసే అభివృద్ధిలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. చిలకలూరిపేట చుట్టూ జాతీయ రహదారుల రావడానికి ఎంపీ కృష్ణదేవరాయల కృషే కారణమని కొమ్మాలపాటి చెప్పారు. పల్నాడు జిల్లా అభివృద్ధిపై నాయకుడిగా కంటే కార్యకర్తగా ఎంతో సంతోషిస్తున్నానన్నారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలతో పేదల కన్నీళ్లు తొలగిపోయాయని కొమ్మాలపాటి తెలిపారు.

మరలా అధికారంలోకి వస్తానని జగన్ కలలుగంటున్నాడు : చదలవాడ అరవిందబాబు (నరసరావుపేట శాసనసభ్యులు)

గతంలో తన హాయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడో ఆయనే ఆలోచించుకోవాలని నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు సూచించారు. కూటమిప్రభుత్వం స్థానిక సంస్థలో గెలుపుకోసం అక్రమాలు చేస్తోందని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎప్పటికీ అధికారంలోకి రాదని, జగన్ 2029లో అధికారంలోకి వస్తానని కలలుగంటున్నాడని అరవిందబాబు ఎద్దేవాచేశారు. మరలా వైసీపీకి ఓటు వేయాలంటే ప్రజలు భయపడేలా జగన్ పరిపాలన చేశాడన్నారు. గత ఎన్నికల్లో నరసరావుపేటలో టీడీపీ గెలవదని ప్రచారం చేశారని, కానీ కూటమిశ్రేణులు, ముఖ్యంగా ప్రత్తిపాటి పుల్లారావు, మంత్రి గొట్టిపాటి కృషితో మంచి విజయం లభించిందన్నారు.

ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, వివిధ హోదాలలో ఉన్న క్లస్టర్, యూనిట్, వార్డు, గ్రామ, బూత్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply