ప్రతిష్ఠాత్మకంగా రేపు వినుకొండ తెదేపా మహానాడు: చీఫ్ విప్ జీవీ
కడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగబోతున్న తెలుగుదేశం మహానాడుకి సన్నాహకంగా సోమవారం వినుకొండలో నియోజకవర్గస్థాయి మహానాడు నిర్వహించనున్నట్లు తెలిపారు ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. వినుకొండ తిమ్మాయపాలెం రోడ్డులోని వై కన్వెన్షన్ హాలులో ఉదయం 9.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. సోమవారం జరగబోయే కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ అభివృద్ధి కోసం అందరి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరిస్తామని, వాటిని నివేదికగా రూపొందించి ఈ నెల 21వ తేదీలోగా పార్టీ కేంద్ర కార్యాలయానికి సమర్పిస్తామని తెలిపారు. ఆదివారం ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగబోతున్న కడప మహానాడు కార్యక్రమానికి అందరినీ సన్నద్ధం చేసే లక్ష్యంతో ఈ మహానాడు పెడుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిర్వహిస్తున్న ఈ మహానాడును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలు, జూన్ నుంచి అమలు చేయబోతున్న పథకాలు, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్యులు, అన్ని వర్గాల ప్రజల సమస్యలపై చర్చించి తీర్మానాలను రూపొందిస్తామన్నారు. నియోజకవర్గస్థాయి మహానాడు కార్యక్రమాన్ని తెదేపా కార్యకర్తలు జయప్రదం చేయాలని జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు.



