వైభవో పేతంగా వాసవీమాత ప్రతిష్టా మహోత్సవం
యడ్లపాడు మండలంలోని ఉన్నవ గ్రామం ఆధ్మాతిక కార్యక్రమాలతో బుధవార కళకళలాడింది. గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో పలు దేవతామూర్తుల విగ్రహాలు ప్రతిష్టించారు. బుధవారం ఉదయం 9.27 గంటలకు తపోవ్రతాన్ని, అహింసా సూత్రాన్ని పాటించిన శాంతి స్వరూపిణి..వైశ్యుల కులదైవమైన శ్రీవాసవీ కన్యాక పరమేశ్వరీదేవి అమ్మవారి ప్రతిష్టా మహోత్సవం వైభవోపేతంగా జరిగాయి. ఇందులో భాగంగా మహాగణపతి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, సింహవాహన, విమాన కలశాల ప్రతిష్ఠలు డాక్టర్ జంధ్యాల వెంకట రామలింగేశ్వరశాస్త్రి పర్యవేక్షణలో వేద మంత్రోచ్ఛారణల నడుమ ఘనంగా నిర్వహించారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవాచనం, కడన్యాసము, హోమం, నేత్రోన్మీలనం, మహా కుంభాభిషేకం, ధేను దర్శనం, మహా పూర్ణాహుతి వంటి పూజా కార్యక్రమాల్లో గ్రామస్తులే కాకుండా సమీప ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తుగా హాజరై అమ్మవారిని దర్శించి పూజించి తరించారు. ఈ ఆధ్మాత్మిక కార్యక్రమానికి హాజరైన వేలాది భక్తులకు దేవస్థాన కమిటీ అన్నసంతర్పణ ఏర్పాటు చేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వచ్చే పోయే భక్తులతో గ్రామంలో ఆధ్మాత్మిక సందడి నెలకొంది. సాయంత్రం ఆలయానికి విద్యుత్‌దీపాలంకరణ గావించారు.



