మాజీ మంత్రి విడదల రజిని అవినీతికి పాల్పడుతూ, అవినీతి పరులకు అండగా నిలిచారు
ముద్దాయిని అరెస్టు చేసే క్రమంలో రజిని వ్యవహరించిన తీరు సిగ్గుచేటు
నేరస్తుడ్ని అరెస్టు చేయడం తప్పా..?
సీఐపై మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లవేసినట్లుంది
జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి
చిలకలూరిపేట: రాష్ట్ర మంత్రిగా పనిచేసి, చట్టాల పట్ల అవగాహన ఉండి, రాజ్యాంగ బద్దంగా నడుచుకోవాల్సిన మాజీ మంత్రి విడదల రజిని ఇందుకు విరుద్దంగా వివిధ కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని అరెస్టు చేసే క్రమంలో వ్యవహరించిన తీరు సిగ్గుచేటని జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి అన్నారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వివిధ కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని తన వాహనంలో ఉంచుకొని, పోలీసులు అరెస్టు చేయటానికి వచ్చిన సమయంలో రాద్దాంతం చేసి, ముద్దాయిని అరెస్టు చేయనీయకుండా పోలీసు విధులను ఆటంకపరిచటమే కాకుండా ఏదో జరిగినట్లు సీన్ క్రియేట్ చేసి ప్రచార ప్రాపకాండకు తెరతీశారని మండి పడ్డారు. తన ఐదేళ్ల కాలంలో విడదల రజిని ఎన్నో అవినీతి, అక్రమాలకు పాల్పడి ప్రజల సొమ్మును దోచుకున్నారని, ఇదే రీతిలో తన అనుచరులు కూడా దోపిడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆమె చేస్తున్న అవినీతిని చూసి, తాము ఎందుకు చేయకుడదని మాజీ మంత్రి రజిని అనుచరులు వివిధ రకాలుగా ప్రజలను మోసం చేసి డబ్బులు వసూలు చేశారని గుర్తు చేశారు.
బయట వ్యక్తుల వద్ద అవినీతికి పాల్పడటమే కాకుండా రజిని అనుచరుడు మానుకొండ శ్రీకాంత్ రెడ్డి సొంతపార్టీ వారి వద్ద అవినీతికి పాల్పడటం సిగ్గుచేటని మండి పడ్డారు. అంగన్‌వాడీల కోసం కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రక్ట్ ఇప్పిస్తానని అప్పట్లో ఆ పార్టీలో ఉన్న నాయకుడు రత్నారెడ్డి దగ్గరకూడా డబ్బులు వసూలు చేయడం, ఆ విషయాన్ని రజిని దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో లాభంలేదని రత్నారెడ్డిలాంటి అనేక మంది నాయకులు పార్టీని సైతం వీడారని గుర్తు చేశారు. తాను అవినీతికి పాల్పడి, తన అనుచరులను అవినీతిని ప్రోత్సహించటమే కాకుండా వారిని వెనుక వేసుకోరావడానికి సిగ్గులేదా.. అని ప్రశ్నించారు. ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకొనే సమర్ధత విడదల రజినిది అని బాలాజి వివరించారు. అవినీతికి పాల్పడిన ముద్దాయిని కాపాడటానికి ప్రయత్నించి పోలీసు విధులను ఆటంకపరిచి, ఆ తప్పును పోలీసుల మీదకు నెట్టడానికి రజిని అండ్ కో ఆడుతున్న నాటకాలు ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. ఈ విషయంలో వైసీపీ అధినాయకత్వం ఆమెను మందలించాల్సింది పోయి, రజినిని పరామర్శల పేరు తో కొత్త డ్రామాలకు తెరతీశారని మండిపడ్డారు. పరామర్శకు వచ్చిన నాయకులు, మాజీ మంత్రి పేర్ని నాని తన విధి ప్రకారం నడుచుకున్న రూరల్ సీఐ సుబ్బానాయడుపై వ్యక్తిగత విమర్శలకు దిగడం, ఆయన కుటుంబం గురించి మాట్లాడం, బ్లాక్‌మెయిల్ చేయడం సహించరానిదన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని సభ్యత సంస్కారం గురించి, చట్టం గురించి మాట్లాడటం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. గత తమ పరిపాలనను ఒకసారి గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. మరోవైపు తాను బీసీ మహిళనని పదేపదే చెప్పుకుంటున్న మాజీ మంత్రి విడదల రజిని తన పాలన కాలంలో బీసీలకు ఏం చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు.
అవినీతి కేసులో ముందస్తు బెయిల్‌పై ఉన్న మాజీ మంత్రి విడదల రజిని అవినీతి పరులను వెంటేసుకు తిరగడం సహేతుకం కాదన్నారు. బెయిల్ ఇచ్చిన సందర్బంగా న్యాయమూర్తి విధించిన షరతులను రజిని తుంగలో తొక్కారని, అందువల్ల బెయిల్ రద్దు చేసి రజినిని అరెస్టు చేయాలని కోరారు. మరోవైపు పోలీసు విధులకు ఆటంకం కల్పించిన విడదల రజినిపై కేసు నమోదు చేసి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బాలాజి కోరారు.



