చిలకలూరిపేట:
పట్టణంలోని కొమరవల్లిపాడులో వేంచేసియున్న శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ప్రాచీన కాలం నుంచి ప్రాముఖ్యత కలిగి ఉన్నది. 1712వ సంవత్సరంలో చిలకలూరిపేట జమీందారులైన రాజామానూరి వంశీకులు ఆలయాన్ని నిర్మించారు.

పట్టణానికి పక్కనే ఉన్న పసుమర్రు గ్రామంలో ఒక ఇంట్లో కాకర పొద తవ్వుతుండగా స్వామివారి విగ్రహం దొరికినదని నానుడి. ఈ విగ్రహాన్ని యడ్లపాడు మండలంలోని చెంఘీజ్‌ఖాన్‌పేటలో ప్రతిష్టించేందుకు తీసుకువెళుతుండగా కొమరవల్లిపాడు చేరుకోగానే అక్కడ నుంచి స్వామివారు కదలలేదని ఆ రాత్రి కలలో జమీందార్‌కు కనిపించి ఇక్కడే ప్రతిష్టించమని కోరినట్లు ఆలయ చరిత్ర తెలుపుతున్నది. దీంతో స్వామివారి విగ్రహంతోపాటు జమీందారుల ఇలవేల్పు అయిన శ్రీఆంజనేయస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. దీంతోపాటుగా స్వామివారికి పెద్దరథం నిర్మించారు. పెద్దరథం నిలిపేందుకు గడియారం స్థంబం సెంటర్‌లో 1918వ సంవత్సరంలో పెద్దరథశాల నిర్మించారు. అప్పటి నుంచి స్వామివారు ఒకచేత శంఖాన్ని, మరోచేత చక్రాన్ని ధరించి లక్ష్మీదేవి సమేతంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ పాలక వర్గ సభ్యులైన గోరంట్ల బాపయ్య 1986లో గాలిగోపురం నిర్మించి కలశ ప్రతిష్ట గావించారు. పూర్వ ధ్వజస్తంభం శిథిలమవడంతో దాతల సహకారంతో 2010వ సంవత్సరంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట చేశారు. ఈ రోజు పెద్ద‌ర‌ధం తిరునాళ్ల‌ను అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్నారు.

Share.
Leave A Reply