మాజీమంత్రి, శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి కార్యాలయం,
చిలకలూరిపేట
విడదల రజనీ బంధువులు మా స్థలం ఆక్రమించారు
- న్యాయం చేయాలని ప్రజావేదికలో మాజీమంత్రి ప్రత్తిపాటిని కోరిన బాధితులు
- స్థలం ఆక్రమణపై సమగ్ర విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేయాలని అధికారుల్ని ఆదేశించిన ప్రత్తిపాటి
ప్రజాసమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించనని, పరిష్కరించగలిగే సమస్యల్ని కూడా యంత్రాంగం పక్కన పెట్టడం మంచి పద్ధతి కాదని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.
స్థానిక క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన కూటమినేతలతో కలిసి ప్రజా వేదిక నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించిన ప్రత్తిపాటి వాటి పరిష్కారంపై దృష్టి పెట్టాలని అధికారయంత్రాంగాన్ని ఆదేశించారు.
మాజీమంత్రి బంధువులు మా స్థలం ఆక్రమించారు..
పట్టణంలోని మార్కెట్ యార్డ్ సమీపంలోని సాయిబాబా గుడివద్ద తమకున్న 10 సెంట్ల స్థలాన్ని విడదల రజనీ బంధువులు ఆక్రమించారని, సమస్య పరిష్కరించి తమకు న్యాయం చేయాలంటూ స్థల యజమానులు ప్రత్తిపాటిని ఆశ్రయించారు. సమస్య వివరాలు తెలుసుకున్న ప్రత్తిపాటి, బాధితులతో మాట్లాడి వారికి వెంటనే న్యాయం చేయాలని, ఆక్రమణదారులపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. సదరు ఆక్రమణదారులపై యంత్రాంగం తీసుకునే కఠిన చర్యలతో ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్ని ఆక్రమించుకోవాలనుకునే వారికి భయం కలగాలన్నారు.
సీ.జీ.ఎఫ్ నిధులు అందేలా చూస్తాను…
తమగ్రామంలో నిర్మించే నూతన దేవాలయాలకు ప్రభుత్వం నుంచి సీ.జీ.ఎఫ్ (కామన్ గుడ్ ఫండ్) నిధులు అందించాలని తిమ్మాపురం గ్రామస్తులు ప్రత్తిపాటిని అభ్యర్థించారు. గ్రామస్తుల విజ్ఞప్తిపై స్పందించిన మాజీమంత్రి, దేవాదాయశాఖ మంత్రితో మాట్లాడి నిధులు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. దేవాలయాల నిర్మాణంతో పాటు, గ్రామాభివృద్ధిలో కూడా గ్రామస్తులు అంతా ఒకేమాటపై ఉండి పనిచేయాలని ప్రత్తిపాటి సూచించారు.
ఇళ్ల నిర్మాణ, పింఛన్ల దరఖాస్తులు పరిశీలించి అర్హులకు న్యాయం చేయండి..
పట్టణంలోని పలువార్డుల్లో గతంలో తాగునీటి సరఫరాలో తలెత్తిన సమస్యలు చాలావరకు పరిష్కారమవడంపై సంతృప్తి వ్యక్తంచేసిన ప్రత్తిపాటి, నీటివృథాను అరికట్టాలని ఆర్.డబ్య్లూ.ఎస్ సిబ్బందిని ఆదేశించారు. మద్దినగర్ వాసులు నీటిసరఫరాలో ఎదుర్కొంటున్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ప్రత్తిపాటి మున్సిపల్ కమిషనర్ని ఆదేశించారు. కొన్నివార్డుల్లో బోర్లు వేయాలని ప్రజలు కోరారని, బోర్ల ఏర్పాటుపై మున్సిపల్ సిబ్బంది దృష్టి పెట్టాలన్నారు. రెవెన్యూ సంబంధిత భూ సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించాలని, సమస్య పరిష్కారానికి అవసరమైతే లోతుగా విచారణ జరిపి, అర్హులైన వారికి న్యాయం చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణం, పింఛన్ల దరఖాస్తుల్ని పరిశీలించి, అర్హులైన వారికి న్యాయం చేయాలని ప్రత్తిపాటి సూచించారు. త్వరలోనే ప్రభుత్వం కొత్త పింఛన్లు విడుదల చేయనుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటుందన్నారు.
వేసవి దుక్కులపై రైతులకు అవగాహన కల్పించండి..
వేసవిలో దొంగలబెడద దృష్ట్యా, నియోజకవర్గవ్యాప్తంగా పోలీసు గస్తీని ముమ్మరం చేయాలని ప్రత్తిపాటి పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. అనుమానితులు, కొత్తవారు కనిపిస్తే ప్రజలు అప్రమత్తులై వారిగురించి ఆరాతీయాలని, అనుమానం కలిగితే వెంటనే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని ప్రత్తిపాటి సూచించారు. వ్యవసాయ సిబ్బంది గ్రామాల్లో పర్యటించి వేసవిదుక్కులపై రైతులకు అవగాహన కల్పించి, నీటివసతి ఉన్నభూముల్లో అపరాలు, కూరగాయల సాగుని ప్రోత్సహించాలన్నారు. ప్రజలిచ్చే అర్జీల విషయంలో అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ప్రత్తిపాటి హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ సి.ఐ రమేష్ జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ టీడీపీ కరీముల్లా, జవ్వాజి మధన్ మోహన్, పఠాన్ సమాధ్ ఖాన్, మద్దుమలా రవి, గంగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.